Maruthi Suzuki: మరోసారి ధరలను పెంచిన మారుతీ సుజుకి!

by Harish |   ( Updated:2022-04-06 10:09:44.0  )
Maruthi Suzuki: మరోసారి ధరలను పెంచిన మారుతీ సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మరోసారి వినియోగదారులను నిరాశ పరిచింది. దేశీయంగా ఇన్‌పుట్ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ నెలలోపు మరోసారి తన అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంగా వాహనాలకు వివిధ ముడి సరుకుల ధరల పెరుగుదల ప్రతికూలంగా ఉందని, దీనివల్ల వ్యయాన్ని భరించడం కష్టంగా మారిందని, అందుకే అదనపు ఖర్చుల భారాన్ని కొంతమేర వినియోగదారులకు బదిలీ చేయక తప్పడంలేదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

నిరంతరం ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో మారుతీ సుజుకి 2021, జనవరి నుంచి ఈ ఏడాది మార్చి నాటికి తన వాహనాల ధరలను దాదాపు 8.8 శాతం పెంచింది. 'ప్రధానంగా వాహనాల మొత్తం వ్యయంలో 75-78 శాతం విడిభాగాలు, ఇతర పరికరాల ధరలే ఉంటాయి. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా వీటి ధరలు పెరుగుతుండటంతో తాము నాలుగుసార్లు కార్ల ధరలను పెంచక తప్పలేదు. అయితే, ధరల పెంపు కూడా ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని పూర్తిగా తగ్గించేందుకు వీలవదని, కంపెనీ సాధ్యమైనంత వరకు వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మారుతీ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. కాగా, తాజా పెంపు నిర్ణయం ఎంత ఉంటుందనే అంశంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. త్వరలో వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story