అమానవీయం.. శ్మశాన వాటికలో నవజాత శిశువు..

by Aamani |
అమానవీయం.. శ్మశాన వాటికలో నవజాత శిశువు..
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం న్యూ గుల్లగూడెంలోని శ్మశాన వాటికలో నవజాత శిశువు లభ్యమైంది.శ్మశాన వాటిక వద్ద నుండి వినిపిస్తున్న ఏడుపుని గమనించిన స్థానికులు అటుగా వెళ్లి చూసేసరికి నవజాత శిశువు తారసపడింది. వెంటనే స్థానిక సిపిఐ నాయకుడికి కబురు చేరవేశారు. స్పందించిన నాయకుడు 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో క్షణాల్లో స్పందించిన పోలీసులు నవజాత శిశువును బాలుడిగా గుర్తించారు. అనంతరం రామవరం లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించుకున్న అనంతరం డిసిపిఓ ఆధ్వర్యంలో భద్రాచలంలోని శిశు గృహానికి తరలించారు.

నవమాసాలు మోసి పురిటి నొప్పులను అధిగమించి శిశువుకు జన్మనిచ్చిన తల్లి భారం అనుకుందో, బాధ్యత మరిచిందో కానీ రోజుల వయసున్న పసి గుడ్డు ప్రాణానికి విలువని ఇవ్వకుండా శ్మశాన వాటికలో వదిలి వెళ్లిపోయిన తీరును తలచుకొని స్థానికులు కంటనీరు పెడుతున్నారు. ఎటువంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా తల్లి తన పిల్లల పోషణ కోసం నూటికి నూరు పాళ్ళు శ్రమిస్తుంది. కానీ ఈ తల్లి తన శిశువు పోషణ భారం అనుకుందో బాధ్యత మరచి స్మశాన కాపరి శివుడికి దత్తత ఇచ్చి చేతులు దులుపుకుందని మరో కొంతమంది మండిపడుతున్నారు. శ్మశానంలో లభ్యమైన ఈ నవజాత శిశువుని ఎవరు వదిలి వెళ్లిపోయారు, కారకులు ఎవరు అని త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement

Next Story

Most Viewed