విన్నపాలను ప్ర‌భుత్వానికి నివేదిస్తాం

by Kalyani |
విన్నపాలను ప్ర‌భుత్వానికి నివేదిస్తాం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఎస్సీ కులాల ఉప వర్గీకరణ కోసం నిర్వహించిన బహిరంగ విచారణలో తమ దృష్టికి వచ్చిన అభ్యర్థనలు, విన్నపాలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఎస్సీ ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివిధ ఎస్సీ కులాల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం షెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణ పై వివరణాత్మక అధ్యయనం కోసం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించారు. వర్గీకరణపై ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ఎస్సీ కుల సంఘాలు ఇచ్చిన దరఖాస్తులను ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ… షెడ్యూల్డ్ వివిధ ఎస్సీ కుల సంఘాల నుంచి 135 వినతులు, అభ్యర్ధనలు అందాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ఉద్యోగ, సామాజిక పరిస్థితులు, చరిత్రాత్మక వ్యవహారాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కుల సంఘాల అభ్యర్థనలు , వినతులు సేకరించి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. బహిరంగ విచారణ జరగకంటే ముందు హనుమకొండ ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. పలు అంశాలను చర్చించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను ఘనంగా సన్మానించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి ఎస్సీ కుల సంఘాల నాయకులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు.

హసన్పర్తి మండలం సుబ్బాయ పల్లి ఎస్సీ కాలనీ సందర్శన

హసన్పర్తి మండలం సుబ్బాయపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీని ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వసతుల కల్పన, మౌలిక సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి,సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల డిఎస్సి డివో , ఎస్ డబ్ల్యూ ఓ లు, ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటీ మెంబర్ ఈవి శ్రీనివాస్ రావు, పలువురు జిల్లా అధికారులు, వివిధ ఎస్సీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story