లక్షలు వెచ్చించి నిర్మించారు... నిర్వహణ మరిచారు

by Kalyani |
లక్షలు వెచ్చించి నిర్మించారు... నిర్వహణ మరిచారు
X

దిశ, శంకర్ పల్లి : భూగర్భ జలాల పెంపు కోసం మూడు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెక్ డ్యామ్ లు నిర్మించింది. తదనంతరం వాటి గురించి నిర్వహణ మర్చిపోయారు. వివరాల్లోకెళితే శంకర్ పల్లి మండలం దొంతన్ పల్లి వద్ద లక్షలు వెచ్చించి నిర్మించిన చెక్ డాం నీరు నిలబడకపోగా చెట్లు పుట్టలతో కనిపించకుండా పోతుంది. వర్షపు నీరు వృధాగా పోకుండా అడ్డు కట్టలు కడితే నీరు భూమిలోకి ఇంకుతుందనే సదుద్దేశంతో ఎత్తు ప్రాంతం నుంచి వచ్చే వరద నీరును ఆపేందుకు వీలుగా చెక్ డ్యాములు నిర్మించింది. ప్రభుత్వ ఆశయం ఎంతో గొప్పది అయినప్పటికీ దానిని కొనసాగించాల్సిన బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులతో పాటు మండల పరిషత్ అధికారులకు కూడా ఉంటుంది.

కానీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమో తమకు ఎందుకులే అనే నిర్లక్ష్యపు ధోరణియో తెలియదు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది ఎక్కడో కాదు గండిపేట నుంచి శంకర్ పల్లి వస్తుంటే దొంతంపల్లి స్టేజి వద్దగల ఇక్ఫా యి కాలేజీకి ఎదురుగా చెట్లు పిచ్చి మొక్కలతో కనిపిస్తోంది. దగ్గరికి వెళ్లేంతవరకు చెక్ డ్యామ్ అనేది కనిపించదు. మండల పరిషత్ అభివృద్ధి అధికారితో పాటు డివిజనల్ పంచాయతీ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహణాధికారి తరచూ మండలంలో, గ్రామాలలో తనిఖీలు చేస్తున్నప్పటికీ ఇలాంటి దృశ్యాలు వారికి కనిపించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed