- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ జిల్లాలో మద్యం సిండి'కేటు'గాళ్ల దోపిడీ!
దిశ, ఖానాపూర్: మద్యపానం హానికరం అంటూనే ప్రభుత్వాలు మద్యాన్ని లైసెన్స్ ఇచ్చి మరి అమ్మిస్తూ ప్రజల చేత తాగిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వివిధ మద్యం బ్రాండ్ ల ధరలని పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. దీనికితోడూ అధికారుల కనుసన్నల్లోనే మద్యం దుకాణాలు సిండికేట్ గా ఏర్పడి ఎం.ఆర్.పి ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుడి, పేదవాడి జీవితాల్లో మద్యం చిచ్చు పెడుతున్నారు. రెక్కల కష్టార్జితాన్ని మద్యం వ్యాపారులకి ధారపోస్తున్నారు. కుటుంబాలు అప్పులపాలు, అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నాయి.
మండలంలోని పాఖాల, శంకర్, వీరభద్ర వైన్స్ అన్ని కలిసి సిండికేట్ గా ఏర్పడి అధిక ధరలకి మద్యం అమ్ముతున్న విషయం అధికారులకి తెలియనిది కాదు. ఈ షాప్ లలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే విషయం బాధితులు టోల్ ఫ్రీ నంబర్స్ కి కాల్ చేసిన, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేవని పలువురు పేర్కొంటున్నారు.
ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మద్యం షాపులు ఒకటి హోల్ సేల్ మరొకటి రిటైల్ పేరుతో నిర్వహిస్తున్నారన్న ప్రచారం ఉంది. హోల్ సేల్ షాప్ ద్వారా బెల్ట్ షాప్ లకి మద్యం ఎక్కువ ధరలకి విక్రయిస్తారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు అంతకుమించి ఎక్కువ ధరకి మద్యం విక్రయిస్తూ పేదవాడి కష్టాన్ని దోచుకుంటున్నారు. మద్యం షాప్ లోనే ఎం.ఆర్.పి ధర కంటే ఎక్కువ ధరకి విక్రయాలు చేస్తున్నారంటే ఇక బెల్ట్ షాప్ లో ఏ మేర ధరని నిర్ణయిస్తారో ఊహించవచ్చు.
నిబంధనలు బేఖాతరు..
మద్యం దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సిట్టింగ్ ఓపెన్ ప్లేస్ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం పర్మిట్ రూమ్ సౌకర్యం ఉన్న వారు కేవలం ఆ రూమ్ పరిధిలోనే సిట్టింగ్ కి అనుమతినివ్వాలి. కానీ ఒక షాప్ లో బహిరంగంగా సుమారు అరెకరం విస్తీర్ణంలో కుర్చీలు వేసి సీటింగ్ అరేంజ్ చేసి సకల సదుపాయాలను అందిస్తూ మద్యం ప్రియులని దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి కాకుండా బ్రాండ్ ని బట్టి అధిక ధరల్ని స్థిరీకరించి అమ్మేస్తున్నారు.
అన్ని బ్రాండ్లు దొరకవు..
వాస్తవానికి అన్ని బీరు, వైన్, విస్కీ లకి సంబంధించి అన్ని రకాల బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. కానీ మద్యం షాపులలో కొన్ని రకాల ఎక్కువ డిమాండ్ లేని మద్యం మాత్రమే అందుబాటులో ఉంటాయి. వినియోగదారునికి ఫలానా బ్రాండ్ బీరు కావాలంటే మద్యం షాప్ లో ఉండదు కానీ ఆ షాప్ నుండే సరఫరా జరిగే బెల్ట్ షాప్ లో మాత్రం అందుబాటులో ఉంటాయి. ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారులకి తెలియనిది కాదనేది నగ్నసత్యం. రాజకీయ పలుకుబడితో కొందరు, మాముల్లు పడేసి మరికొందరు ఇష్టానుసారం అధిక ధరలకి మద్యం విక్రయాలు జరుపుతూ సామాన్యులని అప్పులపాలు చేస్తున్నారు.
మామూళ్ళ మత్తు దిగేనా.. షాప్ లపై చర్యలు గైకొనేనా..
ఇప్పటిదాకా ఎన్నో రకాల పిర్యాదులు వెళ్ళినప్పటికీ ఆ అధికారి చర్యలని దాటవేస్తూ మద్యం వ్యాపారులకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆ అధికారి మద్యం వ్యాపారుల అక్రమాలపై చర్యలు తీసుకుంటారో.. లేదా ఆ పై స్థాయి అధికారులు సదరు అధికారి అలసత్వానికి కారణాన్ని వెలికితీసి ఆ అధికారిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
మద్యం కోసం ఒళ్ళు, ఇల్లు గుళ్ల చేసుకొని పుస్తెలు, మట్టెలు తాకట్టు పెట్టి మరి తాగి అప్పుల పాలైన కుటుంబాలు ఓ వైపు శోకిస్తున్నాయి. కానీ మరోవైపు మద్యం వ్యాపారులు అక్రమ ఆర్జన కోసం పేద, మధ్య తరగతి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నది మాత్రం నిజం.