బ్లాక్ మార్కెట్ - భూ దందా.. కలెక్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రజాప్రతినిధులు

by Manoj |   ( Updated:2022-03-26 17:27:19.0  )
బ్లాక్ మార్కెట్ - భూ దందా.. కలెక్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రజాప్రతినిధులు
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో మూడో పట్టణ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వ్యాపార కేంద్రానికి నిలయంగా మారిన మూడో పట్టణంలో అధికార పార్టీ నాయకులు ఏమి చేసిన అడిగే నాథుడే కరువయ్యారు. బ్లాక్ మార్కెట్ మొదలుకొని భూ దందాలో వీరి చెయ్యి ఉండాల్సిందే. అధికార పార్టీ పేరుతో పోలీస్, రెవెన్యూ, కమర్షియల్ టాక్స్, ఐటీ రంగాల అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రజాప్రతినిధుల మంటూ తాను చేసిందే శాసనంగా చెప్పుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు.

ప్రధానంగా గుట్కా, రేషన్, దందాలో ప్రధాన భూమిక పోషిస్తూ ఇటు పోలీసు.. అటు టాస్క్ ఫోర్స్ అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. ఇంకొందరైతే పార్టీ పదవులు అనుభవిస్తూ మంత్రికి చెడ్డ పేరు తెచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. ఒక డివిజన్ అధ్యక్షుడుగా ఉంటూ వ్యవసాయ మార్కెట్ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకునేందుకు కొంతమంది తోటి వ్యాపారులకు పంగనామాలు పెడుతున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ మధ్యకాలంలో వ్యవసాయ మార్కెట్లో ఒకరిద్దరు ఐపి దాఖలు చేసేందుకు పరోక్షంగా కారకుడు అయినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగడాల రామారావు అనే వ్యక్తి రూ.కోటి 83లక్షలకు దాఖలు చేసేందుకు ఇతడు ప్రధాన కారకుడైనట్లు తోటి వ్యాపారులు చెప్పుకుంటున్నారు.

అదేవిధంగా డివిజన్‌లో కూడా ఇష్టం వచ్చినట్లు సామాన్య ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గోళ్లపాడు ఛానల్ కాలువ ప్రాంతంలో నివసిస్తున్న వారిని బెదిరింపులకు పాల్పడుతూ వికలాంగురాలు అని చూడకుండా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆ డివిజన్ అధ్యక్షుడు. ఇక గాంధీ చౌక్ కు సంబంధించిన ప్రజా ప్రతినిధి కిరాణా జాగిరి వ్యాపారుల అవసరాలను పసిగట్టి లక్షల్లో కలెక్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. బెల్లం లోడ్లను దుకాణాల్లో దింపేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులకు తనకు కొంత అంటూ వ్యాపారుల వద్ద నుంచి లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్లు బాధిత వ్యాపారులు వాపోతున్నారు. బంగారు దుకాణ దారుల వద్దనుండి పార్టీ కార్యకలాపాల పేరుతో పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు లేకపోలేదు. అగ్ర సామాజిక వర్గంలో తనదైన ముద్ర సంపాదించుకునేందుకు తోటి వారికే మాయమాటలు చెప్పి ఈ మధ్య జరిగిన ఆర్యవైశ్య ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచి మంత్రి పేరు వాడినట్లు ఆ సంఘ నేతలే విమర్శిస్తున్నారు. ఈవిధంగా మూడో పట్టణ ప్రాంతంలో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి ఇలాంటి వారిని గుర్తించి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story