KTR: త్వరలో కొత్త రేషన్ కార్డులు.. మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-21 10:19:57.0  )
KTR Says New Ration Cards Will be Granted Soon
X

దిశ, వెబ్‌డెస్క్: KTR Says New Ration Cards Will be Granted Soon| 'తాము అభివృద్ధి చేస్తుంటే కేసులు పెట్టాలని హైదరాబాద్ కు చెందిన కేంద్ర మంత్రి ఒకరు చెబుతున్నారట.. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న తనపై కానీ లేదా ప్రభుత్వంపై కానీ కేసులు పెట్టాలి.. ఇంజినీర్లు, కార్మికులపై కాదు' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్ పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో దేశంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నేతలు కుల, మతాల మధ్య పంచాయితీ పెడుతున్నారని ఆరోపించారు. అగ్నిపథ్ పేరుతో యువత పొట్టకొడుతున్నారని, అగ్నిపథ్ శిక్షణలో హెయిర్ కట్, బట్టలు ఉతకడం, డ్రైవింగ్ నేర్పిస్తారని కిషన్ రెడ్డి అన్నారని, అవి నేర్చుకునేందుకు దేశ యువత మిలటరీలో చేరాలా? అని ప్రశ్నించారు. దేశాన్ని రామరాజ్యం చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు రావణ కాష్ఠం చేస్తోందని మండిపడ్డారు.

వాటిని అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం

హైదరాబాద్ నగరాభివృద్ధికి రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఫ్లైఓవర్లు నిర్మించిందని చెప్పారు. ఇప్పటి వరకు 30 ప్లై ఓవర్ల నిర్మాణం పూర్తి చేయగా.. మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఐడీపీఎల్ విషయంలో పోలీసు కేసులు పెట్టాలని, ఇక్కడ రోడ్లు ఎలా వేస్తారని ఓ కేంద్ర మంత్రి అంటున్నారని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. మీకు దమ్ముంటే మంత్రిగా తనపై కేసులు పెట్టండి కానీ ఇంజినీర్లు, చిన్నా చితక పనులు చేసుకునే కార్మికులపై కాదని అన్నారు. చేతనైతే రక్షణ రంగానికి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, కంటోన్మెంట్ ప్రాంతంలో అద్భుతమైన ప్లై ఓవర్లు, స్కైవేలు కడతామని, ఆ బాధ్యత మాదని అన్నారు. సహాయం చేయాల్సింది పోయి మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని అన్నారు. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి అదనంగా హైదరాబాద్ కు చేసిందేమి లేదని మండిపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. 2014లో జన్ ధన్ ఖాతాలో తెరవాలని, రూ. 15 లక్షలు వేస్తానని ప్రధాని మోడీ చెప్పారని, మీలో ఎవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని సభా వేదికగా ప్రశ్నించారు. 2022 నాటికి ఈ దేశంలో పేదవాడికి కూడా తప్పకుండా ఇండ్లు ఇస్తానని మోడీ చెప్పారని, అందరికీ భారతదేశంలో ఇండ్లు వచ్చాయా అని ప్రశ్నించారు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేస్తున్నామని చెప్పారు.

త్వరలో కొత్త రేషన్ కార్డులు

అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. పేదవారికి అండగా ఉండడమే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని చెప్పారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. అలాగే 57 ఏళ్లు దాటిన అర్హులైన వారికి త్వరలో పింఛన్లు ఇస్తామని కేటీఆర్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed