- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓరుగల్లులో ఊపందుకున్న రాజకీయం.. కాక మీద కాంగ్రెస్.. కొరకాసుతో బీఆర్ఎస్
దిశ, వరంగల్ బ్యూరో : ఓరుగల్లులో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ, ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుండగా, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ నాయకత్వం ఎత్తి చూపుతోంది. ప్రజాపాలన వియోజత్సవాల్లో భాగంగా ఇందిరా క్రాంతి మహిళా సభను ప్రభుత్వం అధికారికంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీ ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసభలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనాయకత్వం పాల్గొంది. వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్‌తోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సభలో గుర్తు చేసుకున్నారు. ఈసభలో రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనలో బీఆర్ ఎస్ కన్నా ఎంతో మిన్నగా పనిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు.
కాంగ్రెస్ వ్యూహాత్మక వైఖరి..!
ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈనెల 19న కాంగ్రెస్ ప్రభుత్వం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇందిరా మహిళా శక్తి సభ నిర్వహించింది. ఈ సభకు ఐదు రోజులకు ముందు నుంచి వరంగల్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఫైళ్ల దుమ్ముదులిపి మరి క్లియరెన్స్ ఇచ్చింది. ఒక్క క్లియరెన్స్ ఇవ్వడమే కాదు.. ఏకంగా ఐదువేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జీవోలను కూడా శరవేగంగా జారీ చేసింది. ప్రభుత్వం వచ్చి పదినెలలు గడిచిపోతున్నా ఏ ఒక్క పని సక్రమంగా చేయలేదన్న విమర్శలు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌తో పాటు విపక్షంగా ఉన్న బీజేపీ నుంచి కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో జనంలో చర్చ పెట్టడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత సక్సెస్అయిందనే చెప్పాలి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజల్లో అసంతృప్తిని ఎమ్మెల్యేలు, మంత్రులు కొండా సురేఖ, సీతక్క సైతం సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షలు, నివేదికలతో యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించారు. రాష్ట్ర స్థాయి శాఖల అధికారులను, ప్రిన్సిపల్ సెక్రటరీలను ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల ప్రణాళికలో భాగస్వాములను చేయించారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నాటి పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు అనేక హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైనవి రాష్ట్రానికి రెండో రాజధాని స్థాయిలో వరంగల్‌ను అభివృద్ధి బాట పట్టిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వరంగల్‌కు ఏయిర్‌పోర్ట్, కుడా మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం, గ్రేటర్ వరంగల్ పరిధిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ, పెండింగ్‌లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పారు. డిసెంబర్ 7వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తి కానుంది. అయితే ఏడాది కాక ముందే వరంగల్ పట్టణాభివృద్ధిపై ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కారు శరవేగంగా చర్యలు తీసుకోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయంగా పబ్లిక్‌లో విమర్శలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ ఎస్, బీజేపీనేతలు సైతం ఆఫ్ ది రికార్డులో ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారు. ఏం చేయడం లేదని సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వం పాలన తీరును తప్పుబట్టిన స్థితి నుంచి కేవలం ఐదు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గిది కదా మేం కోరుకున్నది అంటూ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు కాలర్ ఎగురవేస్తున్నారు. హన్మకొండ సభలో సీఎం ప్రసంగం తర్వాత వరంగల్ కాంగ్రెస్‌లో కొండంత మనోధైర్యం, రాజకీయ నిబ్బరం ఇలా కలిగిపిన సంతోషం కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది కేవలం ఏడాదిలోపే కాంగ్రెస్ చేసి చూపిందంటూ నిధుల విడుదల విషయాన్ని నిదర్శనంగా చెబుతూ కాంగ్రెస్ ప్రతిపక్షాల విమర్శలను ఢీ కొంటోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓరుగల్లులో మంచి స్వింగ్‌లో ఉందనే విషయాన్ని చెప్పక తప్పదు.
పోరాటాలకు బీఆర్ఎస్ సన్నద్ధం..!
రైతు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పేదల భూములను ప్రభుత్వం లాక్కుని ఫార్మా కంపెనీలకు అప్పగిస్తోందని.. లగచర్ల ఘటనలో జిల్లాలో సంఘీభావ ర్యాలీలు, ధర్నాలకు బీఆర్ ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. హన్మకొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేయడంపై ఆ పార్టీ భగ్గుమంటోంది. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ లాంటి నేతలు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందనే పేర్కొంటూ జనంలోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో జనాలకు ఆశచూపి గద్దెనెక్కిందని ఆరోపిస్తున్నారు. రైతుమాఫీ ఇంకా సగం మందికి కూడా జరగలేదనే ప్రధాన ఆరోపణతో పాటు ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని, బోనస్, ఎమ్మెస్పీ లభిచండం లేదని, పత్తి కొనుగోళ్ల విషయంలోనూ ఇదే జరుగుతోందంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయ పోరాటాలకు పూనుకోలేదు. వరంగల్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చూస్తోందని, అందుకు ఖచ్చితంగా కేసీఆర్ వస్తారంటూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడిస్తున్నారు.
లగచర్ల ఘటనలో పేదల భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కోంటదని పేర్కొంటూ ఎస్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాను టార్గెట్‌గా చేసుకుని ఈనెల 21న ధర్నాకు ప్లాన్ చేసింది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని ప్రకటించారు. అయితే లగచర్ల ఘటనతో సంబంధం లేని మహబూబాబాద్ జిల్లాలో ధర్నా నిర్వహించడం ఏంటని, ఇందుకు అనుమతివ్వబోమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ నిరాకరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న విషయం మరిచారంటూ ఈనెల 20న సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు ఎస్పీ కార్యాలయం ఎదుట బీఆర్ ఎస్ నేతలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు, రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌తో పాటు పలువురు నేతలు నిరసన కొనసాగించారు. ఒక దశలో ఎస్పీ కార్యాలయంలోకి వాటర్ బాటిళ్లను విసరడంతో పోలీసులకు బీఆర్ ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనుమతి నిరాకరణతో బీఆర్ ఎస్ పార్టీ 21న ధర్నాను వాయిదా వేసుకుంది. మరుసటి కోర్టును ఆశ్రయించి 25న ధర్నాకు అనుమతి తెచ్చుకోవడం గమనార్హం.
హైటెన్షన్..!
బీఆర్ఎస్ పార్టీ నిరసనలపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. ఉద్దేశపూర్వకంగా లగచర్ల ఘటనను జిల్లాపై రుద్దుతున్నారంటూ మండిపడ్డారు. లగచర్ల ఘటనలో జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మానుకోట జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అలర్ట్య్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావిస్తూ మానుకోట జిల్లా వ్యాప్తంగా 21వ తేదీన 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో గురువారం కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. పోలీసుల కవాతుతో కొంత ఆందోళన పరిస్థితి కనిపించింది. ఈ నెల 25న నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను గిరిజనుల సమీకరించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ధర్నాకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్‌కు చెందిన నేతలంతా పాల్గొననున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలిటికల్ హీట్ పెరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల పేరుతో బీఆర్ఎస్, ఏడాదిలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ ప్రజాక్షేత్రంలో ఢీకొంటున్నాయి. రాజకీయ ఉద్రిక్తతలకు ఓరుగల్లు కేంద్రంగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.