- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గొలుసు తెగలే.. గుడుంబా తగ్గలే!
దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మద్యం గొలుసు దుకాణాల దందా గుట్టుగా సాగుతోంది. నియోజకవర్గంలో గొలుసు దుకాణాల నియంత్రణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ బుట్ట దాఖలవుతోంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపు దందా బార్లను తలపిస్తున్నాయి. పల్లెలు.. మారుమూల గ్రామాలు రాత్రింబవళ్లు మత్తులో జోగుతున్నాయి. విచ్చలవిడిగా గ్రామాల్లో దొరికే మద్యం పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది. పొద్ధంతా కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బు మద్యానికే ఖర్చు చేస్తుండటంతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తుండడంతో మందుబాబులు మత్తులో మునిగి తేలుతున్నారు. నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో గొలుసు దుకాణాల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.-దిశ, చౌటుప్పల్ టౌన్
ఎమ్మెల్యే నిర్ణయం బుట్టదాఖలు
మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు..159 గ్రామ పంచాయతీల పరిధిలో 28 అనుమతి పొందిన మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా అన్ని గ్రామాల్లో సుమారు 700 వరకు అక్రమ బెల్టు షాపులు నడుస్తున్నాయి. ప్రతి పల్లెలో రెండు, మూడు బెల్టు షాపులు ఏర్పాటు చేయడంతో యువత మద్యానికి బానిసలై పెడతోవపడుతున్నారు. కిరాణా కొట్టులో... కూల్ డ్రింక్ షాపుల్లో... కూరగాయలు అమ్మే దుకాణాల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇది గమనించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపుల నియంత్రణకు శ్రీకారం చుట్టాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మహిళలను చైతన్యవంతులను చేసి బెల్ట్ షాపుల నియంత్రణకు కార్యోణ్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో బెల్టు షాపుల నియంత్రణకు కమిటీలు వేశారు. అక్రమ మద్యం, గుడుంబా, నాటుసారా, గంజాయి అమ్మకాలపై గట్టి నిఘా పెట్టించారు. పోలీసులకు సైతం అక్రమ మద్యం, గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దీంతో నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో కొద్దిరోజుల పాటు బెల్టు షాపులు మూతపడ్డాయి. ఇటీవలే కొందరు మద్యం దుకాణాల యజమానులు రాత్రి వేళల్లో... తమ సొంత వాహనాల్లో బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తూ మళ్లీ బెల్టు షాపుల దందా గుట్టుగా సాగిస్తున్నట్టు సమాచారం.
సెలవు రోజుల్లో జోరుగా అమ్మకాలు
గ్రామాల్లో కొనసాగిస్తున్న అక్రమ బెల్ట్ షాపుల్లో ప్రభుత్వ సెలవు దినాలైన గాంధీ జయంతి, స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలు తదితర రోజుల్లో జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలకు సెలవు దినాలు వస్తున్నాయంటే చాలు... ఆ ముందు రోజే లక్షల రూపాయలు వెచ్చించి అవసరమైన మద్యాన్ని తెచ్చిపెట్టుకొని నిల్వ చేసుకుంటున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఎలాంటి భయం..భక్తి లేకుండా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇదంతా పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చినా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప బెల్టు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టడం లేదు.
పేరుకు కిరాణం.. లోపల మద్యం
మునుగోడు నియోజకవర్గంలో బెల్టు దుకాణాలు ఎక్కువగా కిరాణా దుకాణాల్లోనే గుట్టుగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పేరుకు కిరాణం దుకాణాలు నిర్వహిస్తూ లోలోపల గుట్టుగా మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రాత్రి 10 దాటితే మద్యం దొరకకపోయినా...గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్లో మాత్రం ఏ రాత్రి వెళ్లి తలుపు తట్టినా... మందుబాబులకు మద్యం కొదువ ఉండదు. ధర ఎంతైనా... ఏ రకం మద్యమైనా బెల్టు షాపుల్లో ఇట్టే లభిస్తోంది. ఇలా గ్రామాల్లో అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం అందుబాటులో ఉండడం తో యువత పెడదారి పడుతోంది. మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు.
మళ్లీ గుప్పమంటున్న గుడుంబా
గుడుంబా మళ్లీ గుప్పుమాంటోంది. గత పది ఏళ్ల క్రితం కనుమరుగైన నాటు సారా గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ విచ్చల విడిగా లభిస్తోంది. బెల్టు దుకాణాలపై పోలీసుల నిఘా పెరిగిపోవడంతో బెల్టు షాపు నిర్వహకులు కొందరు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నాటుసారా విక్రయాలను అడ్డుకోవలసిన పట్టుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ ప్రాంతంలో నాటు సారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు సమాచారం.