వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భక్తులతో మారుమ్రోగిన ఆలయం

by Manoj |   ( Updated:2022-03-20 14:26:31.0  )
వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భక్తులతో మారుమ్రోగిన ఆలయం
X

దిశ, కొమురవెళ్లి: తెలంగాణ రాష్ట్రంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో మారుమ్రోగింది. బ్రహ్మోత్సవాలు ముగిస్తున్న తరుణంలో ఆలయానికి భక్తులు బారులు తీరారు. రాష్ట్ర నలుమూలల నుండి కొమురవెళ్లికి చేరుకున్న భక్తులు దేవస్థానం వారి సత్రాలలో, ప్రయివేటు అద్దె గదులలో బస చేసి తెల్లవారుజామున స్వామి వారి దర్శనానికి క్యూ లైన్‌లో వెళ్లి దర్శించుకున్నారు.

సుమారు మూడు గంటల సమయం పట్టింది. స్వామివారికి మొక్కుల రూపంలో కేషకాండన, అభిషేకం, కల్యాణం, గంగ రేగు చెట్టు వద్ద ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ జానపద కళ ఉట్టిపడేలా శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు, డమరుగానాధాలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగారు. అనంతరం మల్లన్న అక్క అయిన రేణుక ఎల్లమ్మను దర్శించుకొని మట్టి కుండలో బోనం వండి నైవేద్యంగా సమర్పించి కల్లుసాకతో మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు నలబై వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ గిస భిక్షపతి, ఈ ఓ బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ధర్మకర్తలు ముత్యం నర్సింలు, బొంగు నాగిరెడ్డి, పోతుగంటి కొమురిల్లి, చింతల పార్శారములు, అమర్నాధ్, శ్రీనివాస్, తుమ్మల రమేష్ అర్చకులు, ఒగ్గు పూజారులు, ఆలయ అధికారులు భక్తులకు సేవలందించారు. పోలీసులు హుస్నాబాద్ ACP వాసల సతీష్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐ చెంద్రమోలి యాదవ్ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణతో జాతరను పర్యవేక్షించారు.



Advertisement

Next Story