బాయ్‌కాట్ 'ముస్లిం మామిడి ప‌ళ్లు'! క‌ర్నాట‌క‌లో మ‌రో వివాదం

by Sumithra |
బాయ్‌కాట్ ముస్లిం మామిడి ప‌ళ్లు! క‌ర్నాట‌క‌లో మ‌రో వివాదం
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్' అనే సంస్కృత సామెత‌ను మ‌రిచిన‌ట్లున్నారు క‌ర్నాట‌క‌లోని తీవ్ర‌ హిందూ వాదులు. ఎందుకంటే, ఇటీవ‌ల కాలంలో హిజాబ్ నిషేధం త‌ర్వాత క‌ర్నాట‌క‌లో వ‌రుస‌గా.. దేవాలయాల వద్ద ముస్లిం వ్యాపారుల నిషేధం, హలాల్ మాంసాన్ని బహిష్కరించడం, మసీదులలో లౌడ్ స్పీకర్లపై నిషేధం అంటూ ఒక‌దాని తర్వాత మ‌రో అంశాన్ని తీసుకొస్తూ 'గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి వ‌ర‌కూ లాక్కురావ‌డానికి' తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ మూక‌లు తాజాగా క‌ర్నాట‌క‌లో ముస్లిం పండ్ల విక్రయదారులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందూ జనజాగృతి సమితి, శ్రీరామ సేనతో సహా కర్ణాటకలోని అనేక హిందుత్వ గ్రూపులు ఇప్పుడు హిందూ వ్యాపారులు పండ్ల మార్కెట్‌ను స్వాధీనం చేసుకోడానికి, "వ్యాపారంలో ఆధిపత్యం వహిస్తున్న‌" ముస్లిం పండ్ల విక్రయదారులను బహిష్కరించాలని విచిత్రమైన పిలుపునిచ్చాయి.

ఈ సంద‌ర్భంగా శ్రీరామ సేన‌కు చెందిన సిద్ద‌లింగ స్వామీ అనే వ్య‌క్తి మాట్లాడుతూ, "మామిడి మార్కెట్‌లను ముస్లిం వ్యాపారులు నియంత్రిస్తున్నారు. పేద హిందూ మామిడి విక్ర‌య‌దారులు, వ్యాపారులు మార్కెట్‌ను స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైంది" అని అన్నాడు. "ముస్లింలను వ్యాపారం చేయవద్దని మేము చెప్పడం లేదు; మేము హిందూ యువకులు మార్కెట్ సంబంధిత కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలని మాత్రమే చెబుతున్నాము. ముస్లింలు ధరలను నిర్దేశించకూడ‌దు"అని ఆయన పేర్కొన్నాడు. కర్ణాటకకు చెందిన మరో రైట్ వింగ్ నాయకుడు ప్రశాంత్ సంబర్గి మాట్లాడుతూ, "కఠినమైన పనిని హిందూ రైతులు చేస్తారు. ప్రయోజనాలను మ‌ధ్య‌లో ఉండే ముస్లిం విక్రేతలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) వంటి ప్రతిపక్ష పార్టీలు ముస్లిం వ్యాపారుల నుండి మామిడి పండ్లను కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరుతున్నాము" అన్నాడు.

బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబల్లాపురా, ధార్వాడ్ మరియు రామనగర వంటి 16 జిల్లాల్లో 1.68 లక్షల హెక్టార్లలో మామిడిని సాగుచేస్తున్న క‌ర్నాట‌క‌ భారతదేశంలోని మామిడి ఉత్ప‌త్తిలో అగ్రస్థానంలో ఉంది. ఇక‌, ఈ సంద‌ర్భాన్ని కూడా వ‌ద‌ల‌కుండా కర్నాటకలో ముస్లింల‌పై మరింత బహిష్కర‌ణ విధించాల‌నే లక్ష్యంతో తాజా బహిష్కరణకు పిలుపునిచ్చిన‌ట్లు ప్ర‌జ‌లు భావిస్తున్నారు. భారతదేశ ఐటి హబ్‌గా పిలిచే బెంగ‌ళూరులోని టాప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా కొందరు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని క‌లిసి అక్కడ "పెరుగుతున్న మ‌త‌పరమైన విభజన" అంశాన్ని పరిష్కరించ‌మ‌ని విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

Next Story

Most Viewed