మ్యాథ్స్, సైన్స్ కాన్సెప్ట్‌ల‌తో హైదరాబాదీ కంపెనీ గేమ్స్..

by Hamsa |
మ్యాథ్స్, సైన్స్ కాన్సెప్ట్‌ల‌తో హైదరాబాదీ కంపెనీ గేమ్స్..
X

దిశ, ఫీచర్స్ : బొమ్మల కొనుగోలులో భారతీయ వస్తువులకు ప్రాధాన్యమివ్వాలని 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ప్రజలను కోరారు. బెంగుళూరులో షుమీ టాయ్స్ అనే స్టార్టప్ పర్యావరణ అనుకూల బొమ్మలపై దృష్టి సారించిందని, పూణేకి చెందిన ఫన్‌వెన్షన్ అనే సంస్థ అభ్యసన బొమ్మలు సహా వెహికల్స్, బిల్డింగ్స్ ఇతరత్రా టాయ్స్ ద్వారా పిల్లల్లో విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక, గణితశాస్త్రాలపై ఆసక్తిని పెంచుతోందని అభిప్రాయపడ్డారు. 'టాయ్స్ వరల్డ్'‌లో కృషి చేస్తున్న తయారీదారులు, స్టార్టప్‌లను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టాయ్స్ మేకింగ్‌లో భారతదేశపు స్టార్టప్స్ ఎలా ఆకట్టుకుంటున్నాయో తెలుసుకోవడం సహా దట్టమైన అరణ్యాలు, నర్సరీలు, కెమిస్ట్రీ, మ్యాజిక్ వంటి విభిన్న అభ్యసన బొమ్మలను అందిస్తున్న వివిధ స్టార్టప్స్ విశేషాలు తెలుసుకుందాం.

పిల్లలు ఆడుకునేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అందువల్ల వారి అభిరుచికి తగిన బొమ్మలందిస్తే వాటితో ఆడుకోవడం వల్ల సృజనాత్మకత మెరుగవడమే కాకుండా చురుగ్గా ఉంటారు. ఈ మేరకు కార్డ్‌బోర్డ్ బాక్స్, జంగిల్ జిమ్, టెక్స్ట్‌బుక్, కార్డ్ గేమ్, వైల్డ్‌లైఫ్ సఫారీ, బోర్డ్ గేమ్ సహా మరెన్నో గేమ్స్ పిల్లల కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఇంట్లో ఉన్న బొమ్మలు, కార్లు, లూడోతో చిన్నారులు విసుగు చెందితే.. పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగించే రకరకాల గేమ్, హోమ్ కిట్స్, పజిల్స్‌‌ను ఫన్‌వెన్షన్, అరిరో, కిట్కీ, ఫంక్షన్ వంటి వెబ్‌సైట్స్‌ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.

కిట్కీ: 8 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం బోర్డ్ గేమ్స్:

హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు ప్రమోద్ పొన్నలూరి, రోహిణీ దీప్తి తమ ఉద్యోగాలను వదిలి 2013లో 'కిట్కీ' పేరుతో బోర్డ్ గేమ్స్ తయారీ ప్రారంభించారు. పాఠశాలల్లో పాఠ్యాంశాల ఆధారిత వర్క్‌షాప్స్, ఫీల్డ్ విజిట్స్ నిర్వహించి.. వాటి ద్వారా ఎలాంటి ప్రొడక్ట్స్ తయారుచేస్తే ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకున్న దంపతులు.. ఇంట్రెస్టింగ్ గేమ్స్ తయారు చేసేందుకు మ్యాథ్స్, సైన్స్ కాన్సెప్ట్‌ల‌తో ప్రొడక్ట్స్ డిజైన్ చేశారు. ఈ మేరకు జ్యామితి ఆధారంగా తొలిగా 'త్రీ స్టిక్స్' గేమ్‌ను సృష్టించారు. ఇక్కడ ప్రతీ ఆటగాడు ప్రతీ రౌండ్‌లో మూడు కర్రలను పొందుతాడు. ఈ కర్రలను ఉపయోగించి ఒక త్రిభుజాన్ని నిర్మించాలి. ఆట ముందుకు సాగుతున్న క్రమంలో వచ్చే అడ్డంకులను తొలగించుకుంటూ.. మరిన్ని కర్రలతో ఆ త్రిభుజం చుట్టూ ఆకృతుల నిర్మాణాన్ని సాగించాలి. ఈ బోర్డ్ గేమ్ సక్సెస్ కావడంతో వివిధ దేశాల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. తర్వాత రైజ్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్, స్ట్రాటజీ గేమ్: ఫాసిల్ వార్స్, ట్రివియా కార్డ్ గేమ్, స్పేస్ పైరేట్స్ వంటి ఇతర గేమ్‌లతో ముందుకు వచ్చిన జంట.. పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడొచ్చని పేర్కొన్నారు. కిట్కి అంటే తెలుగులో కిటికీ అని అర్థం కాగా వాస్తవానికి బయట ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తరగతి గది లేదా ఇల్లు, బస్సు కిటికీ నుంచి ఆసక్తిగా చూస్తుంటామని, అందుకే ఆ పేరు ఎంచుకున్నట్లు తెలిపారు.



ఫన్‌వెన్షన్ : 3 నుంచి 14 సంవత్సరాల పిల్లల కోసం DIY కిట్స్:

పూణేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మిలింద్, గ్రాఫిక్ డిజైనర్ కమలేష్ 2016లో పిల్లల కోసం YouTubeలో DIY ట్యుటోరియల్స్ పోస్ట్ చేసేవారు. అలా చేస్తున్న క్రమంలోనే పిల్లల కోసం బొమ్మల కంపెనీ పెట్టాలనే ఆలోచన రావడంతో ఫన్‌వెన్షన్ (Funvention) స్టార్ట్ చేశారు. ఇందులో కాటాపుల్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ సహా వాహనాల మోడల్స్ తయారీ సూచనలతో కూడిన కిట్స్ అందుబాటులో ఉంటాయి. 2017లో రూపొందించిన DIY గార్డెన్ డ్రిప్ ఇరిగేషన్ కిట్ వీరి ఫస్ట్ ప్రొడక్ట్ కాగా ఇది అత్యధికంగా సేల్ కావడంతో నెలల వ్యవధిలోనే విమానాలు, బైక్స్, రథాలు మొదలైన వాటి కోసం ఎనిమిది డిఐవై మోడల్ కిట్స్‌ను లాంచ్ చేశారు. అంతేకాదు బొమ్మ రోబోట్ లేదా చిన్న రాకెట్ లాంచర్ చేసేందుకు కూడా కిట్స్ ఇందులో పొందవచ్చు. ఫన్‌వెన్షన్ ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో 100 కంటే ఎక్కువ DIY ఉత్పత్తులను కలిగి ఉంది.

అరిరో : 8 ఏళ్లలోపు పిల్లల కోసం చెక్క బొమ్మలు:

చెన్నయ్‌కి చెందిన తమిళ్‌సెల్వన్.. మాంటిస్సోరి టీచర్ అయిన తన భార్య నిషా వసంత్ (30)తో కలిసి అరిరోను 2018లో స్థాపించాడు. కూతురు ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకోవడం వల్ల కలిగే నష్టాన్ని గ్రహించిన దంపతులు.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్న వేప చెక్కతో బొమ్మలు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు యూరప్, చైనాలోని బొమ్మల ఉత్సవాలకు హాజరై, అక్కడి బొమ్మలను పరిశీలించిన తర్వాత అరిరోను ప్రారంభించారు. తమిళంలో పసిపాపలకు పాడే మొదటి లాలిపాట అరిరో కావడం సహా భారతీయ బ్రాండ్ అని సూచించేందుకు ఆ పేరును సంస్థకు పెట్టుకున్నాడు. ఇందులో దొరికే ఆటవస్తువులు పిల్లల్లో మోటార్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సహా బిజీగా ఉంచడంలో సాయపడతాయి. 15ఏళ్లలోపు పిల్లల కోసం DIY(డూ-ఇట్-యువర్‌సెల్ఫ్) మోడల్ కిట్స్ కూడా ఉన్నాయి. ఇక మౌల్డింగ్ కోసం కర్నాటకలోని చన్నపట్న, ఆంధ్రప్రదేశ్‌లోని ఏటికొప్పాక బొమ్మల తయారీ సంఘాలతో కలిసి పనిచేస్తోన్న అరిరో.. పిల్లలు రకరకాల ఆకృతులను నేర్చుకోవడంలో, ప్రాదేశిక అవగాహనను పెంపొందించడంలో ఉపయోగపడే విధంగా 16 కేటగిరీల్లో ఉత్పత్తులు తయారుచేస్తోంది.

స్కిల్‌మాటిక్స్: 3 ఏళ్లు పైబడిన పిల్లలు గేమ్స్ నేర్చుకోవడం

2017లో స్కిల్‌మాటిక్స్‌ ప్రారంభం కాగా ఉత్పత్తి కోసం ఒక నమూనాను అభివృద్ధి చేసిన తర్వాత, అది మూడు దశల పరీక్షల ద్వారా అమలు చేయబడుతుంది. ప్రతి దశలో కనీసం 60 మంది పిల్లలు పాల్గొంటారు. కన్సల్టింగ్ చైల్డ్ సైకాలజిస్ట్‌లు, టీచర్లు సహా ప్రొడక్ట్ డెవలపర్స్‌‌తో కూడిన బృందం ద్వారా ఈ పరీక్షను పర్యవేక్షిస్తారు. 2019లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉన్న ఐకానిక్ టాయ్ స్టోర్ కంపెనీ హామ్లీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ చేసిన మొదటి భారతీయ కంపెనీగా స్కిల్‌మాటిక్స్ అవతరించింది.

కాడూ: 6 అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లల కోసం వన్యప్రాణుల నేపథ్య బోర్డ్ గేమ్స్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ పర్యావరణ వ్యవస్థలను అన్వేషించడంలో ఈ బోర్డ్ గేమ్స్ సాయం చేస్తాయి. కాడూ (కన్నడ ఫర్ ఫారెస్ట్) అనేది బెంగళూరుకు చెందిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్, వ్యాపారవేత్త దినేష్ కుంబ్లే ఆలోచన కాగా 2016లో దీన్ని ప్రారంభించాడు. వన్యప్రాణులు సహా అడవులను పరిచయం చేసేందుకు ఇదొక ఆసక్తికరమైన మార్గమని మేకర్స్ పేర్కొన్నారు. కార్డ్ గేమ్స్, జిగ్సా పజిల్స్ సహా నైట్ హైర్ వంటి సహకార గేమ్‌లను కూడా ఇది పరిచయం చేసింది. నీలిగిరి బయోస్పియర్, ఆఫ్రికన్ సవన్నాలను ఫ్యామిలీ గేమ్స్‌గా డిజైన్ చేయడం విశేషం.



Advertisement

Next Story