2021-22 లో రూ. 32 లక్షల కోట్లతో భారత్ రికార్డు స్థాయి ఎగుమతులు!

by Vinod kumar |
2021-22 లో రూ. 32 లక్షల కోట్లతో భారత్ రికార్డు స్థాయి ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్ల(రూ. 31.76 లక్షల కోట్ల) కు చేరుకున్నాయని, ఇది నిర్దేశించిన లక్ష్యం కంటే 5 శాతం ఎక్కువని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాభరణాలు, రసాయనాల కీలక మద్దతుతో అత్యధిక ఎగుమతులు నమోదయ్యాయి. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఎగుమతులు నెలవారీ గరిష్ట స్థాయి 40 బిలియన్ డాలర్ల(రూ. 3 లక్షల కోట్ల) ను తాకాయని చెప్పారు.


గత నెలలోనే ప్రభుత్వం 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అధిగమించినట్టు పీయూష్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి రికార్డు స్థాయి ఎగుమతులు నమోదైనట్టు పేర్కొన్నారు. ఇది అంతకుముందు 2018-19 లో నమోదైన అత్యధిక ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల(రూ. 25 లక్షల కోట్ల) కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.


అలాగే 2020-21 లో భారత ఎగుమతులు 292 బిలియన్ డాలర్లు(రూ. 22.19 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో అమెరికా, యూఏఈ, చైనా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ దేశాలు భారత్ ఎగుమతి చేసిన మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఎలాంటి రాయితీలు, గ్రాంట్లు లేకుండానే అద్భుతమైన ఫలితాలను సాధించాం. గ్లోబల్ మార్కెట్లో భారత్‌ను మరింత మెరుగైన స్థాయిలో ఉంచాలని భావిస్తున్నాం. త్వరలో అది సాధ్యమవుతుందనే నమ్మకం ఉందని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed