- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి భూములతో వ్యాపారం చేస్తే ఊరుకోం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, శంకర్ పల్లి : పేదోడి అసైన్డ్ భూములకు ప్రభుత్వం హక్కులు కల్పిస్తూ.. పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల గ్రామంలోని అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కునేందుకు కొన్ని రోజులుగా చేస్తున్న కుట్రను తెలుసుకున్న ఆయన ఆ భూములను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల భూములతో ప్రభుత్వం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పేదోడి తరఫున జైలుకి వెళ్లడానికి సిద్ధమని చెప్పారు.
మోకిల గ్రామంలోని సర్వే నంబర్ 96, 197లో 600 ఎకరాలు 8 దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం పేదలకు బతుకుదెరువు కోసం భూములు ఇవ్వగా.. ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆ భూములను లాక్కొని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతలు, తండ్రులు, కుమారులు వంశ పారంపర్యంగా ఆ భూములను నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండగా ప్రస్తుతం పేదల భూములపై ప్రభుత్వం కన్ను పడి ఆ భూములను లాక్కొని బడా బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు.
దళిత, గిరిజన వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన వందలాది మంది కుటుంబాలు భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, ఆ భూములకు హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్న భూములను లాక్కోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని వివరించారు. ఎన్నికలకు ముందు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అధికారం చేపట్టాక ఇవ్వకపోగా.. ఉన్న భూమిని లాక్కోవాలని సంబంధిత అధికారుల చేత సర్వే చేయించేందుకు కుట్ర పన్నడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
ప్రభుత్వ అధికారులు.. మీ భూముల సర్వే కోసం వస్తే సర్వేను అడ్డుకోవాలని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని, వారు ఇచ్చే ముష్టి ఎకరాకు 400 నుంచి 600 గజాల స్థలం ఇస్తామని కొందరు బ్రోకర్లు మీ వద్ద మధ్యవర్తిత్వం వహించేందుకు వస్తారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో 1300 మంది యువకులు అమరులై తెలంగాణ సాధించుకుంటే.. కేవలం ఆ ఒక్క కుటుంబానికే మేలు జరిగిందని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ పదవి చేపట్టాక ఏకంగా కౌలుదారు కాలం తీసేసి రైతులకు మోసం చేశాడని, ధరణి కాలం సృష్టించి రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల అసైన్డ్ భూమిని పేదలకు దక్కకుండా నిషేధిత జాబితా క్రిందికి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా రూ.30వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ..ఈ భూములపై కన్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో లేఅవుట్‌లు చేసి సొంత ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.
మల్లన్న సాగర్ బాధితులైన 20 గ్రామాల ప్రజలకు నాసిరకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అప్పగించి వారిని ప్రస్తుతం రోడ్డుపాలు చేశాడని, కొండపోచమ్మ సాగర్ బాధితుల పరిస్థితి కూడా దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. జస్టిస్ నాగార్జునరెడ్డి నివేదిక ప్రకారంగా 30 సంవత్సరాలు ఎవరైతే ఆ భూములను అనుభవించిన వారు ఉంటారో వారికి హక్కులు కల్పించాలని ఉందని, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 13 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. వారిని పూర్తిగా పక్కకు తప్పించి పట్టాదారులకే పూర్తి హక్కులు కల్పించడం వల్ల కౌలుదారులకు రైతుబంధు, రైతు బీమా అవకాశం లేకుండా పోయిందని అన్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన రోగులకు రక్షణ లేకుండా పోయిందని, ఐసీయూలో జరిగిన దారుణం అందరినీ కన్నీరు పెట్టించింది అని ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందని ప్రశ్నించారు. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే దున్నటానికి భూమి అనే నినాదంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఎల్మెల ఆనందం, అడివయ్య, మాజీ ఎంపీటీసీ యాదయ్య, రాములు, మాజీ కో-ఆప్షన్ నెంబర్ ఖాదర్ పాషా, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోకిలా భూ బాధితులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.