దేశంలోనే అతి పొడవైన సొరంగమార్గం హైదరాబాద్‌లో..?

by Satheesh |
దేశంలోనే అతి పొడవైన సొరంగమార్గం హైదరాబాద్‌లో..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే అతి పొడవైన సొరంగ రహదారి (టన్నెల్) హైదరాబాద్‌లో నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల మేర నాలుగు రోడ్లతో విశాలమైన సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పజెప్పింది. ఈ సొరంగ రహదారి కేబీఆర్ పార్క్ జంక్షన్ మీదుగా ఎన్ఎఫ్‌సీఎల్ జంక్షన్ ద్వారా పంజాగుట్ట వరకు నిర్మించనున్నారు. ఈ టన్నెల్‌ను బోరింగ్ మెషీన్ ద్వారా తవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల ద్వారా సాంకేతిక సలహాలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా, దీని నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను సైతం అన్వేషిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ 9.20 కి.మీ లతో దేశంలోనే అత్యంత పొడవైనదిగా నిలిచింది. ఒకవేళ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పనులు జరిగితే.. త్వరలోనే హైదరాబాద్‌లో నిర్మించే టన్నెల్ అత్యంత పొడవైనదిగా మారనుంది. అయితే, ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్ కోసం నిర్మించే ఫ్లైఓవర్‌ల వల్ల కేబీఆర్ పార్క్‌లో వందలాది చెట్లు నరికివేస్తున్నందున ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్‌లో చెట్లు నరకడంపై పర్యావరణ ప్రేమికులు, నగరవాసుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు రావడంతో మంత్రి కేటీఆర్.. చెట్లను నరికివేయకుండా భూగర్భ సొరంగం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed