సలాం ఆర్మీ డాగ్స్.. విధి నిర్వహణలో ప్రాణాలర్పిస్తున్న శునకాలు

by sudharani |
సలాం ఆర్మీ డాగ్స్.. విధి నిర్వహణలో ప్రాణాలర్పిస్తున్న శునకాలు
X

దిశ, ఫీచర్స్ : మిలిటరీలో ఆధునిక సాంకేతిక పురోగతి ఉన్నప్పటికీ అనేక ఆపరేషన్స్‌లో 'శునకాల' సాయాన్ని తీసుకుంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ సైనిక శిబిరాల్లో విధులు నిర్వర్తిస్తున్న పలు శునకాలుండగా, కొన్ని రెస్క్యూ టీమ్‌లో, ఇంకొన్ని బాంబు స్క్వాడ్స్‌ గ్రూపులో, మరికొన్ని తిరుగుబాటు ప్రాంతాల్లో, వీఐపీలకు భద్రతను అందించడంలో సేవలందిస్తున్నాయి. మహమ్మారి సమయంలోనూ మానవ మూత్రం, చెమట, శరీర వాసనాల ఆధారంగా కొవిడ్‌ను గుర్తించడంలోనూ కర్తవ్యాన్ని నిర్వర్తించిన మూగజీవాలు.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పిస్తున్నాయి.

ఈ క్రమంలోనే జమ్మూ-కశ్మీర్‌లో జూలై 30న రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌తో సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్న 'యాక్సెల్' అనే రెండేళ్ల ఆర్మీ డాగ్ ప్రాణాలు కోల్పోగా.. సేవలను గుర్తించిన ఆర్మీ 'సెర్మోనియల్ గార్డ్ ఆఫ్ హానర్' అందించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్మీలోకి శునకాలను ఎలా ఎంపిక చేస్తారు? వాటి పదవీకాలం ఎంత? ఎలాంటి పురస్కారాలు, పతకాలు అందిస్తారు? వంటి విశేషాలు తెలుసుకుందాం.

ఆయుధ సంపత్తి, ఆధునాతన సాంకేతికత మాత్రమే కాదు సైనిక దళాల్లో అంతర్భాగమైన జాగిలాలు కూడా భారత ఆర్మీ సైనికులకు బలాన్ని అందిస్తున్నాయి. ఈ మేరకు ట్రాకింగ్, గార్డింగ్, మైన్ డిటెక్షన్, పేలుడు పదార్థాల గుర్తింపుతో పాటు పదాతిదళ పెట్రోలింగ్, హిమపాతం రెస్క్యూ కార్యకలాపాలు, సెర్చ్ అండ్ రెస్య్కూ సహా మాదక ద్రవ్యాల గుర్తింపులో జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అదేవిధంగా నిషిద్ధ వస్తువులను పసిగట్టడం, సంభావ్య లక్ష్యాలపై దాడి చేయడంతో పాటు తలదాచుకున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు శోధన కార్యకలాపాల్లో విధులు నిర్వర్తిస్తాయి. ఇక మీరట్‌లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (RVC) ద్వారా శునకాలు శిక్షణ పొందుతుండగా, ఇక్కడి ట్రైనింగ్ డాగ్స్ కోసం బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, కంబోడియాతో పాటు దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి డిమాండ్ పెరిగింది. అంతేకాదు భారత సైన్యం నిర్వహించే డాగ్-హ్యాండ్లింగ్ కోర్సుల ద్వారా ఇతర దేశాలు తమ సొంత సైనిక సిబ్బందికి శిక్షణనిస్తాయి. RVCతో పాటు, 'కెనైన్ సోల్జర్స్'‌కు టార్గెటెడ్ ట్రైనింగ్ ఇవ్వడంలో నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ (NTDC) కూడా ప్రసిద్ధి పొందింది. బ్రీడింగ్, ట్రైనింగ్, రేరింగ్ సహా రిహాబిలేషన్ విభాగాల్లో కఠినమైన, సమగ్రమైన శిక్షణను ఈ సంస్థలు అందిస్తున్నాయి.

డాగ్ యూనిట్స్: ఆర్మీకి 25 ఫుల్ డాగ్ యూనిట్లు, రెండు హాఫ్ యూనిట్లు ఉన్నాయని 2019లో పార్లమెంటులో రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఫుల్ యూనిట్‌లో 24 కుక్కలు ఉంటే, హాఫ్ యూనిట్‌లో 12 ఉండగా.. వీటిలో లాబ్రడార్స్, జర్మన్ షెపర్డ్స్, బెల్జియన్ మాలినోయిస్, గ్రేట్ మౌంటైన్ స్విస్ వంటి వివిధ జాతుల కుక్కలు సేవలందిస్తున్నాయి. ప్రతీ ఆర్మీ డాగ్‌కు ఒక డాగ్ హ్యాండ్లర్ ఉంటుండగా.. వాటి భద్రత, శ్రేయస్సుకు అతనే బాధ్యత వహిస్తాడు.

ఎంత కాలం సేవలో ఉంటాయి? సుమారు ఎనిమిది సంవత్సరాలు సేవలో ఉంటాయి. అయితే ఆర్మీలో సేవలందించి రిటైర్ పొందిన శునకాలను యూథనైజ్(నొప్పి తెలియకుండా చంపడం)చేసే పద్ధతి గతంలో ఉండగా, ఈ చర్యపై ఢిల్లీ హైకోర్టు(2016)లో పిల్ దాఖలైన తర్వాత ఆ విధానాన్ని సవరించి కుక్కలకు పునరావాసం కల్పిస్తామని అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ డిక్లరేషన్ సమర్పించారు.

గుర్తింపు: జాగిలాలు అందించే విశిష్ట సేవలకుగానూ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ కార్డ్, వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమాండేషన్ కార్డ్‌తో పాటు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ కమాండెషన్ కార్డ్‌ను పొందేందుకు అర్హత పొందుతాయి. డాగ్ హ్యాండ్లర్లు కూడా శౌర్య పతకాలకు అర్హులు కాగా ఇప్పటికే ఎంతోమంది శౌర్య చక్ర సహా ఆర్మీ మెడల్స్ అందుకున్నారు.

ఎల్‌ఓసిలో బుజో సేవలు: భారత సైన్యంలోని 150 ఎక్సపర్ట్ డాగ్స్‌లో బుజో ఒకటి కాగా ఇది నియంత్రణ రేఖ, లోతట్టు ప్రాంతాల్లో సేవలందిస్తోంది. శత్రువుపై దాడి చేయడంతో పాటు, ప్రత్యర్థి కదలికలను పసిగట్టడం, పేలుడు పదార్థాలను గుర్తించే నైపుణ్యాల్లో నైపుణ్యం పొందుతాయి. సాధారణంగా డబుల్ కోట్ జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన శునకాలే ఇక్కడ విధులు నిర్వర్తిస్తాయి. ఈ ప్రాంతంలోని చల్లని వాతావరణానికి సరిపోవడమే ఇందుకు కారణం.

కౌంటర్ టెర్రరిజం: ఇండియన్ ఆర్మీకి చెందిన కౌంటర్ టెర్రరిజం యూనిట్‌లో బెల్జియన్ మాలినోయిస్‌ జాతి జాగిలాలను 2020లో చేర్చుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ శిబిరాల్లో వీటిని ఉపయోగిస్తుండగా, ఇవి దాడులు చేయడంలో నేర్పరితనం ప్రదర్శిస్తాయి. చురుకుదనం, తెలివితేటలు, స్మార్ట్ మైండ్ సహా దూకుడుకు ప్రసిద్ధి చెందాయి. భద్రతా కార్యకలాపాల్లో సాయుధ దళాలకు సాయపడే ఉత్తమ కుక్క జాతుల్లో ఒకటిగా, సాయుధ దళాలకు ఇష్టమైన జాతిగానూ ఖ్యాతి పొందిన బెల్జియన్ మాలినోయిస్.. 2011లో ఒసామా బిన్ లాడెన్ ఆపరేషన్‌లో పాల్గొనడం విశేషం. ఆ తర్వాత 2019లో ప్రమాదకరమైన మార్గం ద్వారా ISIS నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీని వేటాడింది.

బ్రేవ్ K9

భారతదేశంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో CRPF 'కె9' డాగ్స్‌ను మొదటిసారిగా ఉపయోగించింది. ఆ తర్వాత, ఐటీబీపీ, ఎన్‌ఎస్‌జీ వంటి ఇతర కేంద్ర సాయుధ పోలీసు ఏజెన్సీలు కూడా ఈ కుక్కలను దత్తత తీసుకున్నాయి.

గ్రేట్ ఎఫర్ట్: పర్వత ప్రాంతాల్లో గ్రేట్ స్విస్ మౌంటైన్ కుక్కలతో పాటు లాబ్రడార్లు, జర్మన్ షెఫర్డ్‌, బఖర్వాల్ సహా కాకర్ స్పానియన్ కుక్కలను గతంలో అనేక మిషన్లలో ఉపయోగించారు. వీటిలో ఎన్నో ఆర్మీ డాగ్స్ ప్రశంసలను అందుకోగా.. ఉన్నత అధికారులు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నుంచి గౌరవ పతకాలు పొందాయి. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు 130కి పైగా స్నిఫర్ డాగ్‌లను వినియోగించింది సైన్యం.

ఇతర దేశాల్లో: యునైటెడ్ కింగ్‌డమ్‌లో సైనిక లేదా పోలీసు సేవలో జంతువులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం PDSA డికిన్ మెడల్ అందిస్తారు. బ్రిటీష్ సాయుధ దళాలు లేదా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో విశిష్ట సేవలందించే జాగిలాల కోసం పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్ (PDSA) వ్యవస్థాపకురాలు మారియా డికిన్ 1943లో ఈ అవార్డును ప్రకటించారు. బ్రాంజ్ డికిన్ మెడల్‌పై ఒక వైపు 'ఫర్ గ్యాలంట్రీ' అని, మరో వైపు 'వి ఆల్సో సర్వ్' అనే పదాలు ఉంటాయి. అమెరికా విషయానికి వస్తే.. 2019 జాగిలాలకు శౌర్య పతకం అందిస్తుండగా, అమెరికన్ హ్యూమన్ అసోసియేషన్ ద్వారా K-9 ధైర్య పతకాన్ని కూడా ఇస్తున్నారు.

Advertisement

Next Story