ఆ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు ఓ వరం: మంత్రి హరీశ్ రావు

by Web Desk |
ఆ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు ఓ వరం: మంత్రి హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్ల నియోజకవర్గ పరిధిలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం లోని 189 మంది అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష 116 రూపాయల చొప్పున రూ.1,89,96,924 కోట్లు, సీఎంఆర్ఎఫ్ కింద 101 మంది లబ్ధిదారులకు రూ.40 లక్షల 42 వేల 500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 10 లక్షల 56 వేల 239 పెళ్లిళ్లకు రూ. 8 వేల 421 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ఇంటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని తెలిపారు.

గతంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇలాంటి సంక్షేమ పథకాలను ఇచ్చింది లేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 సాయం అందించడంతో పాటు, బిడ్డకు కాన్పు అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి, పైసా ఖర్చు లేకుండా తల్లి, బిడ్డలను ప్రభుత్వ వాహనంలో ఇంటికి దింపుతున్నదని ఇది మా ప్రభుత్వ తీరని ధీమాగా చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లభిస్తున్నదని, గర్భిణీలకు సిజేరియన్ చేయించకుండా నార్మల్ డెలివరీ చేయించాలని, అలా చేస్తేనే తల్లి, బిడ్డలకు మేలుగా చెప్పుకొచ్చారు. సిద్దిపేట సర్కారు దవాఖానలో 150 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రైవేట్ దవాఖానకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్, సిటీ స్కాన్ కేంద్రాలు, ఒక్క పైసా ఖర్చు లేకుండా డయాలసిస్ యూనిట్ కేంద్రం, బొక్కలు, కండ్లు, పండ్ల డాక్టర్లు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.7,300 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story