కరువు గ్రామానికి కళ తెచ్చిన రైతు..

by GSrikanth |
కరువు గ్రామానికి కళ తెచ్చిన రైతు..
X

దిశ, ఫీచర్స్ : 'నీటి కరువు'తో అల్లాడుతున్న ఎన్నో గ్రామాల గురించి రకరకాల కథనాలు వింటూనే ఉన్నాం. గుజరాత్‌, డాంగ్ జిల్లాలోని వాగాయ్ కూడా అలాంటి గ్రామమే. నిజానికి ఈ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నా.. కొండలు, రాళ్లతో కూడిన భూభాగం కావడంతో వేసవి సహా మిగతా సీజన్లలోనూ కొన్ని నెలల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కరించాల్సిందిగా గంగాభాయ్ పవార్ అనే 60 ఏళ్ల రైతు.. ఆ గ్రామ సర్పంచ్‌‌ను కోరాడు. కానీ అతడు పట్టించుకోకపోవడంతో, తానే రంగంలోకి దిగి గ్రామ నీటి అవసరాల కోసం స్వయంగా ఓ బావిని తవ్వాడు.

గంగాభాయ్ పవార్ తన గ్రామస్తుల కష్టం చూసి చలించిపోయాడు. నీటి కొరత తీర్చాల్సిందిగా సర్పంచ్‌కు పలుసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోవడంతో రెండేళ్ల క్రితం స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించాడు. 32 అడుగుల లోతు వరకు తవ్విన తర్వాత నీళ్లు రావడంతో గ్రామస్తులు సహా ఆ ఊరి సర్పంచ్ గీతాబెన్ రైతు కృషిని అభినందించారు. ఈ బావి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తోందని, సాగునీటి అవసరాలకు దోహదపడుతోందని గ్రామానికి చెందిన అర్జున్ బాగుల్ తెలిపాడు.

డాంగ్ జిల్లాలో ప్రతీ రుతుపవనంలో దాదాపు 125 అంగుళాల వర్షం నమోదవుతుంది. అయినప్పటికీ వర్షపు నీరంతా సముద్రంలో కలిసిపోతుంది. దీంతో ఇక్కడి గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ గ్రామ జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా.. నీటి కొరత కారణంగా మరో జీవనోపాధి లేక రైతులంతా అల్లాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed