కేసీఆర్‌కు ఊహించని షాక్.. భారీ దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన మాజీ ఐఏఎస్‌లు

by GSrikanth |
కేసీఆర్‌కు ఊహించని షాక్.. భారీ దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన మాజీ ఐఏఎస్‌లు
X

మాజీ ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ పై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకొని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. లోపాలను ఎత్తిచూపుతున్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పరిశీలిస్తూ ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. విద్యాధికులే లక్ష్యంగా, చాపకింద నీరులా ఈ వ్యూహం అమలవుతున్నది. వీళ్లంతా సర్కారు చిన్నచూపును తట్టుకోలేక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారే కావడం గమనార్హం. అంతిమంగా వీరి ప్రభావం ఏ పార్టీకి ఓటుగా మారుతుందనేది ఇప్పటికైతే సస్పెన్స్!

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యావంతులే లక్ష్యంగా మరో వ్యూహం అమలవుతున్నది. సీఎం కేసీఆర్​ హామీలు, బడ్జెట్​లో నిధుల కేటాయింపులపై క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేక ప్రచారం మొదలైంది. దీనికి కొంతమంది మాజీ ఐఏఎస్​లు శ్రీకారం చుట్టారు. టీఆర్​ఎస్​ సర్కారు విస్మరిస్తున్న హామీలను ప్రజల వద్దకు తీసుకుపోతున్నారు. ఉన్నత విద్యావంతులు రంగంలోకి దిగడంతో అటు టీఆర్ఎస్‌కూ గుబులు పట్టుకుంది. స్వరాష్ట్రం కోసం సహకరించిన ఐఏఎస్ అధికారులే ఇప్పుడు వ్యతిరేక రాగం అందుకున్నారు. తెలంగాణ ఐఏఎస్‌లపై సీఎం చేసిన నిర్లక్ష్యం ఇలా ఆయన మెడకు చుట్టుకుంటున్నది. ప్రస్తుతానికి కొందరు ఎవరికి వారుగానే ఏదో ఒక రూపంలో క్షేత్రస్థాయికి వెళ్తున్నారు.

విమర్శలతో తెరపైకి

స్వరాష్ట్రంలో స్థానిక ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రాధాన్యం లేదని నాలుగేండ్లుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దళిత ఐఏఎస్ లకు అన్యాయం జరుగుతున్నదని ఆయన బహిరంగ విమర్శలే చేశారు. కొంతమంది దళిత ఐఏఎస్ లు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో మురళి వీఆర్ఎస్ తీసుకోవడం, ఆ వెంటనే ఆయనను ఏపీ ప్రభుత్వం పిలిచి విద్యాశాఖ సలహాదారుడిగా నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఒకరిద్దరు ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ ఆవేదనను బయట పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారికి ప్రయార్టీ పోస్టులు ఇంత వరకూ దక్కడం లేదు. బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేదని, ఐపీఎస్​ అధికారులను పట్టించుకోవడం లేదని మాజీ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ సైతం పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే కామెంట్లూ వచ్చాయి. మాజీ పోలీస్ అధికారులకు మంచి మంచి పదవులు ఇస్తున్నారని, కీలక శాఖలను మాజీల చేతుల్లో పెట్టారనే విమర్శలకు దిగారు. తాను తెలంగాణను విడిచి వెళ్లనని, ఇక్కడే ఉండి పోరాటం చేస్తానంటూ కూడా వీకే సింగ్​ ప్రకటించారు.

ఆర్ఎస్పీ రాజీనామా

గతేడాది ఐపీఎస్​ అధికారి, ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టారు. బహుజన రాజ్యాధికారం పేరుతో యాత్ర చేస్తున్నారు. ఆకునూరి మురళి కూడా రాష్ట్రంలో కీలకంగా తిరుగుతున్నారు. వాస్తవంగా ఆయన రూపొందించి, ఏపీలో అమలు చేస్తున్న కార్యక్రమాన్నే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు–మన బడిగా తీసుకున్నది. కానీ, విద్యా శాఖకు నిధులు కేటాయించడం లేదని, బడ్జెట్​లో పద్దు పెడుతున్నా, ఖర్చు చేయడం లేదంటూ ఇటీవల ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామాల్లో బడుల నిర్వహణపై అధ్యయనం చేస్తున్నారు. సోషల్​ డెమోక్రటిక్​ ఫోరం తరుపున ఆకునూరి మురళి రాష్ట్రంపైనే కన్నేశారు. ప్రస్తుతం పార్టీలకు అతీతంగా ఫోరం తరఫునే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

బీసీలు లక్ష్యంగా మరొకరు

గతేడాది రిటైరైన ఐఏఎస్​ అధికారి చిరంజీవులు కూడా ఇటీవల స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, బీసీ వర్గాలు లక్ష్యంగా తిరుగుతున్నారు. పదవీ విరమణకు ముందు చిరంజీవులును కూడా ప్రభుత్వం ఇబ్బందులపాలు చేసింది. కొన్ని నెలలపాటు వెయిటింగ్​లో పెట్టింది. ఓ స్వచ్ఛంద సంస్థ పేరిటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఇటీవల ఎత్తివేస్తామని ప్రకటించిన 111 జీవోపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరో మాజీ ఐఏఎస్​ అధికారి చంద్రవదన్​ కూడా పలు సందర్భాల్లో తెరపైకి వస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. ఈ మాజీ ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు చెప్పే అంశాలు క్షేత్రస్థాయిలో బాగా ప్రభావితం చేస్తున్నాయని తెలుస్తున్నది. ఇప్పుడు కేసీఆర్​ లక్ష్యంగా పని చేస్తున్న ఈ ఉన్నతాధికారుల బృందం అంతిమంగా ఎవరికి మేలు చేయడం కోసం పని చేస్తున్నదనేది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే!

అసంతృప్తి పెద్దదే

ప్రస్తుతం తెలంగాణ స్థానికత కలిగిన 18 మందికి అప్రాధాన్య పోస్టులు కేటాయించారు. వీరిలో మెజారిటీ ఆఫీసర్ల పోస్టులు ఐఏఎస్‌ అధికారులకు కేటాయించాల్సినవి కావనే భావన ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన తెలంగాణ ఐఏఎస్​లకు కేసీఆర్​ హయాంలో ప్రాధాన్యం లేదనే విమర్శలున్నాయి. అవమాన పరిచే స్థానాలను కేటాయించారనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితిలోనే తెలంగాణ స్థానిక ఐఏఎస్‌ అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed