దళారుల పాలైన రైతుల పరిహారం.. ఎమ్మెల్యేను సైతం పావు చేసే ప్రయత్నం

by Javid Pasha |
దళారుల పాలైన రైతుల పరిహారం.. ఎమ్మెల్యేను సైతం పావు చేసే ప్రయత్నం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయడం సర్వసాధారణం. దానికి భూ నిర్వాసితులు తమకు మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహరం డిమాండ్ చేయడం కూడా సాధారణం. కానీ ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్‌ల శాఖ ఇచ్చిన ధరను చెల్లించడం, మార్కెట్ రేటు కోసం భూ నిర్వాసితులు నిరసన చేయడం చూస్తుంటాం. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల క్రితం కట్టిన సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కొందరు రైతుల పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన పరిహారం రైతులకు బదులు కొందరు మద్యవర్తుల పాలైంది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంలో అరవై శాతం వారు నొక్కేసి రైతులను ముంచేశారు.

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 21,22 పనులు జరుగుతున్న నేపథ్యంలో మంచిప్ప( కోండేం చెరువు) రిజర్వాయర్ కోసం అక్కడ 3 గ్రామాలు,8 తాండాలలో భూములు కోల్పోతున్న వారి పరిహారం పెంపు కోసం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ వ్యవహరం చర్చనీయాంశమైంది. మూడు శక్తులు కలిసి రైతులకు వచ్చిన పరిహారం దర్జాగా మింగేశారు. న్యాయ పోరాటం జరుగుతుండగానే రైతులతో క్రయ విక్రయాల ఓప్పంద పత్రాలతో వారికి వచ్చిన పరిహారాన్ని తీసుకొని వారు అందులో 40 శాతం చెల్లించి అరవై శాతం నోక్కేశారు.

అది ఓ పక్కా ప్రణాళిక భూ మాఫియా చేసిన తతంగం. ప్రభుత్వానికి, ఇటు రైతులకు శఠగోపం పెట్టిన వైనం. ఇదంతా చేసింది సర్కారు ఉద్యోగుల సంఘం నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి, అధికార పార్టీ నేత కలిసి ప్రభుత్వానికి ఎగనామం పెట్టారు. ఈ వ్యవహారంలో మంత్రిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని పక్కదారి పట్టించారని కూడా ప్రచారంలో ఉంది. వారిని తప్పుదోవ పట్టించి కోట్లు కొల్లగొట్టారు. జరిగిన తతంగం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే. కానీ ఎక్కడా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా చేశారనేది నిజం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

భారీ, మధ్యతరహా, చిన్న నీటిపారుధల పథకాలు అయిన కేవలం వ్యవసాయానికి సాగునీరు లక్ష్యంగా కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణం చేయడం దాని ప్రకారం భూసేకరణ కోసం పరిహారం ఇచ్చాయి కూడా. ఇలా వచ్చిన దాంట్లో రామడుగు ప్రాజెక్టు.నిజామాబాద్ రూరల్ నియోకజవర్గంలోని ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రామడుగు ప్రాజెక్టు కోసం సేకరించిన వ్యవసాయ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అయితే ముంపు కింద మరో 40 ఎకరాలకు పైగా సేకరణ చేసి నష్టపరిహారం రైతులకు చెల్లించారు.

ఇంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాతనే అసలు తంతు మొదలైంది. భూసేకరణలో కీలకంగా ఓ సర్వేయర్ అన్ని తానై వ్యవహరించాడు. ఉద్యోగ సంఘం నేత కలుగజేసుకుని భూ పరిహారం వ్యవహారానికి ప్లాన్ వేశాడు. అక్కడి రైతులను పిలిపించుకుని వారి భూముల వివరాలు సేకరించి న్యాయ పోరాటం చేశారు. అంతేగాకుండా రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకుని ఈ తతంగం మొదలుపెట్టారు. న్యాయస్థానానికి కావలసిన వివరాలను సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు కాసుల ఏర చూపి అనుకున్నట్లుగానే రికార్డులు చూపించారు.

అలా కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు రావడంతో వచ్చిన సొమ్మును రైతులకు ఎగవేశారు. ఈ భూములను అధిక ధరలకు అమ్మకానికి పెట్టారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఎవరూ బయటపెట్టలేదు.రామడుగు ప్రాజెక్టు వ్యవహరంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యేకు కనీసం ఈ వ్యవహరం తెలియకుండా మేనేజ్ చేయడం విశేషం.

ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ఉద్యోగ సంఘం నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి, అధికార పార్టీ నేత కలిసి ఏకంగా రైతులకు, ప్రభుత్వానికి ఎగనామం పెట్టడం విశేషం. సుమారు 40 ఎకరాల భూమని అటు రైతులకు కాకుండా ఇటు ప్రభుత్వానికి కాకుండా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతుల్లో పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.

మంచిప్పపై దృష్టి

రామడుగు ప్రాజెక్టులో కోట్లు గడించిన ఈ గ్యాంగ్ ఇప్పుడు మంచిప్ప ప్రాజెక్టుపై పడ్డారు అనే వాదనలు షూరూ అయ్యాయి. కాళేశ్వరం ప్యాకేజీ పనులు కారణంగా ముంపు పేరుతో తీసుకున్న భూములను రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రాజెక్టు ( రిజర్వాయర్ )స్థాయి, పరిధి పెరుగడంతో వీరికి అవకాశం కలిసి వచ్చినట్లు అయింది. 1,5 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీల సామర్థ్యానికి పెరుగడంతో అక్కడ పరిహారం కూడా ప్రభుత్వానికి భారం కానుంది. ఇదే సమయంలో పరిహారం పెంచడానికి జరుగుతున్న ఆందోళనలో మళ్ళీ అదే గ్యాంగ్ రంగంలోకి రైతులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి.

ఇందులో రూరల్ ఎమ్మెల్యేను సైతం పావును చేసే కుట్ర జరుగుతుందనే ప్రచారం ఉంది. రామడుగులో ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. మంచిప్పలో అదే జరిగితే స్థానిక ఎమ్మెల్యేకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే మంచిప్ప రైతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇంతకు చివరకు ఇక్కడ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed