యుద్ధం సద్దుమణిగే వరకూ స్టాక్ మార్కెట్లలో అస్థిరత తప్పదు!

by Harish |
యుద్ధం సద్దుమణిగే వరకూ స్టాక్ మార్కెట్లలో అస్థిరత తప్పదు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగుతుండటం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం, ద్రవ్యోల్బణం ప్రభావం వంటి కారణాలతో దాదాపు 2.5 శాతం క్షీణించాయి. వీటికి తోడు దేశీయంగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి వాహనాల అమ్మకాలు, ప్రభుత్వ జీడీపీ గణాంకాలు స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్‌ను ఒత్తిడికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో రాబోయే వారం రోజుల ట్రేడింగ్‌లో ఇదే ధోరణి కొనసాగవచ్చని, ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావారణం సద్దుమణిగితే తప్ప పెరిగిన అస్థిర పరిస్థితి తగ్గదని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, దేశీయంగా కీలక ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు కూడా సూచీలపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్‌తో పాటు ముడి చమురుపై ఆధారపడిన రంగాలు రానున్న వారం రోజులు ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అయితే, మెటల్, ఐటీ, కొన్ని కీలక పరిశ్రమల షేర్లు మార్కెట్ల అధిక నష్టాలను నియంత్రించేలా ర్యాలీ చేయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్-ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు.

ఈ వారంలో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలు..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత పది రోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. మరోవైపు రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలను కూడా పెంచుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లను అధిగమించడంతో సరఫరా సంక్షోభం ఏర్పడి, ఇంధన మార్కెట్ దారుణంగా దెబ్బతిన్నది. ఈ పరిణామాల వల్ల ముఖ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ముడి చమురును ఎక్కువగా వినియోగించే కంపెనీల షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మదుపర్లు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం..

ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల ఇతర దేశాలతో పాటు భారత్ కూడా ద్రవ్యోల్బణ సమస్యలను ఎదుర్కొంటుంది. గత నెలలో ప్రారంభమైన యుద్ధం కారణంగా రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రిటైల్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అత్యధికంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పెరుగుతున్న గోధుమలు, పామాయిల్, బొగ్గు రానున్న మరికొద్ది రోజుల్లో ప్రజలను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టేయవచ్చు. దీనివల్ల ఆర్‌బీఐ నిర్ణయం ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడులపై ఆందోళన పడొచ్చని తెలుస్తోంది.

ఎఫ్ఐఐ నిధులు..

గత ఏడాది నుంచి వరుసగా ఆరో నెలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకెళ్తున్నారు. 2022, మార్చిలో కేవలం మూడు సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ. 14,721 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు నికరంగా రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు. ఇదే కాలంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐ) రూ. 1.38 లక్షల కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఇక, గత వారం రోజుల్లో ఎఫ్ఐఐలు రూ. 22,563 కోట్లు వెనక్కి వెళ్లిపోగా, డీఐఐలు రూ. 16,742 కోట్లు పెట్టుబడి పెట్టారు. రానున్న వారంలో అమ్మకాలు కొనసాగితే మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు.

ఆర్థిక గణాంకాలు..

దేశీయంగా పెట్టుబడిదారులు ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగాలకు సంబంధించిన గణాంకాలపై దృష్టి సారించనున్నారు. ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి బయటపడి పునరుద్ధరణ సాధిస్తున్న తరుణంలో ఈ గణాంకాలు మెరుగ్గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Next Story