ధూమపానంతో దృష్టిలోపం.. సిగరెట్ పొగలో 7 వేలకు పైగా ప్రమాదకర కెమికల్స్

by Mahesh |   ( Updated:2022-05-04 11:47:10.0  )
ధూమపానంతో దృష్టిలోపం.. సిగరెట్ పొగలో 7 వేలకు పైగా ప్రమాదకర కెమికల్స్
X

దిశ, ఫీచర్స్ : 'ధూమపానం ఆరోగ్యానికి హానికరం'.. ఎంతలా అంటే? భారత్‌లో ప్రతి ఏటా మిలియన్‌‌‌కు పైగా జనాలు స్మోకింగ్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని మొత్తం మరణాల్లో ఇది 53 శాతంగా నమోదైంది. ఇక క్యాన్సర్, గుండె జబ్బులు వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులకు ధూమపానం నాల్గవ ప్రధాన కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు పొగతాగడం వల్ల కలిగే దుష్ర్పభావాలు దృష్టిలోపాన్ని కూడా కలిగిస్తాయని నేత్ర వైద్యులు చెబుతున్నారు. సిగరెట్ పొగలోని టాక్సిన్స్ కళ్లతో పాటు శరీరమంతటా వ్యాపించి, రక్త ప్రవాహంలోకి చేరుకుంటాయని నిపుణులు వివరించారు.

భారతదేశ జనాభాలో దాదాపు 34.6 శాతం మంది ధూమపానం చేస్తారని సమాచారం కాగా, సిగరెట్ పొగలో.. 7,000 కంటే ఎక్కువ ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కంటి ఆరోగ్యానికి ఎంతో హానికరం కాగా ధూమపానం వల్ల 'డ్రై ఐ(పొడి నేత్రం)', కంటిశుక్లం, డయాబెటిక్ రెటినోపతి, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత, ఆప్టిక్ నరాల సమస్యలు వంటి వివిధ రకాల కంటి సమస్యలు వస్తాయి. ఆయా రుగ్మతల నివారణకు సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోతే శాశ్వత అంధత్వానికి దారి తీసే అవకాశముంటుంది. అంతేకాదు పొగాకు పొగ.. కళ్ల చుట్టూ ఉన్న కణజాలం పై కూడా ప్రభావం చూపుతుండగా, దీనివల్ల కళ్ల కింద వాపు ఏర్పడుతుంది.

పొడి కన్ను : కళ్ళు పొడిబారకుండా నీరు, జిగురు, నూనె వంటి పదార్థాలు స్రవించబడతాయి. ఈ మూడు తగినంత నిష్పత్తిలో ఉత్పత్తి కాకపోతే కళ్ళు పొడిబారే సమస్య మొదలవుతుంది. దీన్నే 'డ్రై ఐ' గా పిలుస్తాం. పొగాకులోని పొగ.. టియర్ ఫిల్మ్‌లోని లిపిడ్ పొరను విచ్ఛిన్నం చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల కళ్లలో ఇసుక పడ్డట్లుగా నిత్యం అసౌకర్యానికి గురవడమే కాక కళ్ళు ఎర్రబడతాయి.

వయసు సంబంధిత మచ్చల క్షీణత (AMD): కేంద్ర దృష్టిని కోల్పోవడం వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. కంటిచూపు మసకబారి క్రమేణా దృష్టిలోపం గణనీయంగా పెరుగుతుంది.

కంటిశుక్లం : ధూమపానం ఏ వయసులోనైనా కంటి శుక్లానికి కారణమవుతుంది. స్మోకింగ్ చేసే వారిలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య అపారదర్శక, అస్పష్టమైన దృష్టిని కలిగిస్తుంది. దీనిని శస్త్రచికిత్స ద్వారా సరిదిద్దవచ్చు.

గ్లాకోమా: మెదడు, కళ్ల మధ్య అనుసంధానమైన ఆప్టిక్ నాడి దెబ్బతినడం వల్ల కంటి లోపల అదనపు ద్రవం పేరుకుపోతుంది. దీనివల్ల ఒత్తిడి పెరిగి గ్లాకోమా కు దారితీస్తుంది. అయితే సిగరెట్లు ఎక్కువగా తాగేవారిలో గ్లాకోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని 2018లో జరిగిన ఓ అధ్యయన ఫలితాలు పేర్కొన్నాయి.

ఏం చేయాలి?

ధూమపానం మానేయడం లేదా తగ్గించడం: దృష్టితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ధూమపాన అలవాటును మానేయడమే ఉత్తమం. ఇది ధూమపానం చేసే వ్యక్తికే కాకుండా అతని చుట్టుపక్కల వ్యక్తుల కళ్లకు కూడా మేలు చేకూరుస్తుంది.

ఆరోగ్యకర ఆహారం : కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి, ఇ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కళ్లకు మంచి జరుగుతుంది.

స్క్రీన్ టైమ్ : ధూమపానం తో పాటు ఎక్కువ సమయం స్క్రీన్స్ చూడటం వల్ల కళ్లు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. పొగ తాగడం మానడం తో పాటు కళ్ళకు హాని కలగకుండా ఉండేందుకు స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా కంటి వ్యాయామం చేయాలి.

రెగ్యులర్ కంటి పరీక్ష : కళ్ల సంరక్షణ కోసం రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేసుకుంటూ, వైద్యుల సలహా ప్రకారం తగిన ఆహారం తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed