పది అయినా పనికి రాలేదు.. అందులో వాళ్లదే ఇష్టారాజ్యం

by Vinod kumar |   ( Updated:2022-03-08 13:49:50.0  )
పది అయినా పనికి రాలేదు.. అందులో వాళ్లదే ఇష్టారాజ్యం
X

దిశ, వరంగల్ టౌన్: కొత్త దవాఖాన్లు కట్టెందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖకు నిన్నటి బడ్జెట్ లోనూ పైసలు బాగానే ముడుపు కట్టింది. అన్ని బాగానే ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల తీరు విస్మయం కలిగిస్తోంది. పొద్దున 10 దాటిన ఆస్పత్రిలో ఒక్క డాక్టర్ లేడు.. ఓపీ కోసం వచ్చిన రోగులు ముక్కుతూ, మూలుగుతూ గోడలకు యాళ్ళాడబడ్డట్లు నిలబడ‌టం క‌నిపించింది. డాక్టర్లు ఎప్పుడొస్తారని అడిగితే రోగులు, వారి బంధువులు, సిబ్బంది నుంచి తెలియ‌ద‌నే స‌మాధానం రావ‌డం గ‌మ‌నార్హం. విషయమేమిటో తెలుసుకుందామని 'దిశ' రిపోర్టర్‌ ప్రయత్నిస్తే ఆర్ఎంవో అందుబాటులో లేర‌ని కార్యాల‌య సిబ్బంది ద్వారా తెలిసింది. పీఆర్వో ఫోన్ ఎత్తలేదు. సూపరింటెండెంట్ రూం ఛాయలకు కూడా సిబ్బంది అనుమతి నిరాకరించ‌డం గ‌మనార్హం.

ఎవరు చూస్తున్నారో.. ఎప్పుడు వస్తారో..


ఓపీ విభాగంలో అంతా గందరగోళం నెలకొంది. అప్పటికే వందకు పైగా రోగులు వైద్యుల కోసం వేచి చూస్తున్నారు. కానీ.. ఆ రూంలో ఉన్న ఏడెనిమిది కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క నర్సు, వార్డు బాయ్ తప్ప ఎవరూ లేరు. డాక్టర్లు ఎప్పుడు వస్తారని ప్రశ్నించగా.. 'మీకు తెల్వంది ఏముంటది. ఒక్కోక్కలు చిన్నగొస్తరు .. ' అంటూ.. వార్డు బాయ్ సమాధానం చెప్పడం చూస్తుంటే ఎంజీఎం మెయింటెనెన్స్ పూర్తి అస్తవ్యస్తంగా మారినట్లు అర్థమవుతోంది. వైద్యులు ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది.

కొన్ని గదులకు తాళం..


పది దాటినా డాక్టర్లు పనికి రాలేదంటే కొన్ని గదులకు తాళాలు కూడా తీయలేదు. అవి ఎప్పుడు వస్తారో సమాధానం చెప్పేవారు సైతం అందుబాటులో లేరు. ఓపీలో డాక్టర్లే లేరు.. తాము మాత్రం వెళ్లి చేసేదేముందని అనుకున్నారో ఏమో! రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించే వారు కూడా ఆలస్యంగానే విధుల్లోకి రావడం కనిపించింది. ఇవే కాదు.. ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో విధుల పట్ల నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఆఖరికి ఆర్ఎంవో ఎప్పుడొస్తారో కూడా చెప్పలేని స్థితిలో ఆయన సీసీ ఉండటం గమనార్హం. ప్రజారోగ్య పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. ఎంజీఎంలో నెలకొన్న ఈ పరిస్థితులకు సమాధానం ఎవరు చెబుతారో? సమస్యను ఎవరు పరిష్కరిస్తారో? చూడాలి మరి.

Advertisement

Next Story