యూపీలో దారుణం.. మ‌రోసారి కాళ్లు నాకించారు! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-03-20 15:12:17.0  )
యూపీలో దారుణం.. మ‌రోసారి కాళ్లు నాకించారు! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌ళ్లీ మ‌ళ్లీ అదే వివ‌క్ష‌... మొద‌టి పౌరుణ్నే గుళ్లోకి రానీయ‌కుండా మెట్ల‌పై కూర్చోబెట్టిన ఘ‌న‌త భార‌త‌దేశం సొంతం. అయినా, మ‌రోసారి 'తమ వాదాన్ని' గెలిపించామ‌ని గ‌ర్వంగా చెప్పుకునే దేశ జ‌న‌త, స‌మాన‌త్వం లేని సిద్ధాంతం మంచిదెలా అవుతుంద‌ని ప్ర‌శ్నించుకోలేకపోతున్నారు. ఒకే జాతి అంటూ 'భార‌తమాత‌' ముసుగు క‌ప్పుకుంటున్న‌ నాయ‌కులు 'త‌క్కువ జాతి', 'ఎక్కువ జాతి' అంటూ జ‌రుగుతున్న‌ కుల వివ‌క్ష‌త‌ను చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తున్నారు. మాన‌వ‌త్వం అంటే అంద‌రూ మ‌నుషుల‌మనే భావ‌నే అనే సోయ కూడా లేని పాఠాలు నేర్పుతున్నారు. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బు త‌ప్ప ఆత్మ‌గౌర‌వం ఉండ‌ద‌ని అనుకుంటున్నారేమో గానీ తాయిలాలు ఇస్తూ ఓట్లు వేయించుకుంటున్నారు. ఫ‌లితం, మ‌ళ్లీ మ‌ళ్లీ అదే వివ‌క్ష‌..

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో కులం పేరుతో దళిత వర్గానికి చెందిన మైనర్ బాలుడిపై దాడి చేసి, నాలుక‌తో పాదాలు నాకించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ 2 నిమిషాల 30 సెకన్ల వీడియో అఖండ భార‌తదేశ యుగాల‌ చ‌రిత్ర‌ను, నాయ‌కులు దాచుంచే క‌ఠోర నిజాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ స‌జీవంగా చూపించింది. ఈ వీడియోలో ఓ టీనేజ్ యువ‌కుడు తన చెవుల‌ను ప‌ట్టుకొని, గుంజీళ్లు తీస్తుంటాడు. కొంద‌రు యువ‌కులు మోటార్‌ సైకిళ్లపై కూర్చొని బాధితుణ్ని బెదిరిస్తూ ఉంటారు. బాధితుడు నేలపై భయంతో వణుకుతున్నప్పుడు అగ్ర‌జాతిగా భావించే వీళ్లు నవ్వుతుంటారు. ఈ నిందితుల్లో ఒకరు బాధితుణ్ణి, ఉన్నత కులానికి చెందిన 'ఠాకూర్' పేరు చెప్పమని అదిలిస్తుంటారు. బాధితుణ్ణి దుర్భాషలాడుతూ, "మళ్ళీ అలాంటి తప్పు చేస్తావా?" అంటూ హెచ్చ‌రిస్తుంటారు. ఇంత‌కీ, ఆ బాధితుడు చేసిన త‌ప్పేంటంటే అత‌ని త‌ల్లి వాళ్ల పొలంలో ప‌నిచేసినందుకు డ‌బ్బులిమ్మ‌ని అడ‌గ‌ట‌మే! ఇక‌, ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

ఏప్రిల్ 10న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన‌ వీడియో అల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడైన విద్యార్థి, బాధితుడి త‌ల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులు అగ్రవర్ణాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బాధితుడిపై దాడి చేసిన వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద యూపీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు స‌మాచారం. బాధితుడు 10వ తరగతి విద్యార్థి, కాగా వితంతువు అయిన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. బాధితురాలి తల్లి ఈ నిందితుల పొలాల్లో పని చేసిందని, ఆ పని కోసం బాలుడు వారిని డబ్బు అడిగాడ‌ని, స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో ఈ విష‌యాలు ఏమీ లేక‌పోవ‌డం విశేషం. ఇలాంటి ప‌రిస్థితిలో మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే వివ‌క్ష ఎందుకు కొన‌సాగ‌దు..?!

Advertisement

Next Story

Most Viewed