పేదలకు మాటలతో నమ్మించి చేతలతో గొంతు కోస్తున్న ప్రభుత్వాలు: సిపిఐ చాడ వెంకట్ రెడ్డి

by Web Desk |
పేదలకు మాటలతో నమ్మించి చేతలతో గొంతు కోస్తున్న ప్రభుత్వాలు: సిపిఐ చాడ వెంకట్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా దేవరయంజాల్ గ్రామా రెవిన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిలో పేద గిరిజనులు వేసుకున్న గుడిసెలను సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వాలు మాటలతో నమ్మించి చేతలతో గొంతు కోస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మంత్రులను, బడా నాయకులను, భూబకాసురులను వదిలేసి పేదల గుడిసెలపై ఉక్కుపాదం మోపి తొలిగిస్తున్నారని తెలిపారు.




వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఫార్మ్ హౌస్, గోడౌన్ లు వెలుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. కబ్జాకు గురైన 1500 వందల ఎకరాల దేవరయంజాల్ దేవాలయ భూములు ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవటలేదని ప్రశ్నించారు. అంటే ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే, పీకేసి వారిపై ప్రతాపం చూపిస్తారా..? అని మండిపడ్డారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులతో జల్, జంగల్, జమీన్ నినాదం తో పోరాటాలు నిర్వహించాలని అయన పిలుపునిచ్చారు.

అజీజ్ పాషా మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల్లో భూపోరాటాలు చేసిన సిపిఐ పార్టీ సుమారు 40 కి పైగా కాలనీలు ఏర్పాటు చేసి పట్టా ఇప్పించామని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటివరకు పేదలకు ఒక్క పట్టా కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు సిపిఐ ఎప్పుడు అండ ఉంటుందని పోరాటాల ద్వారానే ఇళ్ల పట్టాలు సాధించుకోవాలని అయన పిలుపునిచ్చారు.

బాలమల్లేష్ మాట్లాడుతూ.. కూలినాలి చేసుకొనే పేద ప్రజలు దేవరయంజాల్ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేసారు. లేనిపక్షంలో మార్చ్ 13 న ఇళ్ల పట్టాల సాధనకై వేలాదిమందితో 'చలో కీసర' కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలో జిల్లా సిపిఐ నేతలు వెంకట్ రెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బలమల్లేష్, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్, జై సేవాలాల్ గుడిసెవాసుల సంఘం నేతలు మున్నా, వినోద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed