దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి: జగన్

by Javid Pasha |
దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి: జగన్
X

దిశ, భూపాలపల్లి: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుపై ఒక లేఖ బుధవారం విడుదల చేశారు. హిందుత్వ ఫాసిస్టు బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ప్రజలకు, కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు ఉపయోగపడే ఏ పనులు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదలను సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.

దీనికి మానిటైజేషన్ అనే పేరును తగిలించి ప్రైవేటీకరణ చేస్తున్నదని, కార్మిక వర్గం అనేక సమరశీల పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను కాలరాసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకు, ఆర్టీసీ, టెలికాం, వైమానిక రోడ్లు తదితర రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని, దానిని వెంటనే ఆపాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించి 50 వేల కోట్ల రూపాయలను దండుకోవాలని కుట్ర చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని కోరారు.

దాంతో పాటుగా వారి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో కార్మిక వర్గం తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఉద్యోగస్థులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సంపూర్ణ మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం తలపెట్టిన రెండు రోజులు సార్వత్రిక సమ్మెకు ప్రతి ఒకరు మద్దతు తెలపాలని, యువతీ, యువకులు, నిరుద్యోగులు, కార్మిక, కర్షక, ఉద్యోగస్తుల కుటుంబాలు మద్దతు తెలపాలని ఆయన తన లేఖలో పిలుపునిచ్చారు. దేశంలో ప్రజలను ఎదుర్కొంటున్నారని, సామ్రాజ్యవాదులు తలపెట్టిన ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం, ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని జగన్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed