రాజగోపాల్ రెడ్డి అంశంలో కేసీఆర్ ప్లాన్- బీ?

by GSrikanth |
రాజగోపాల్ రెడ్డి అంశంలో కేసీఆర్ ప్లాన్- బీ?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలతో అధికార టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. మునుగోడు శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఎలా అనే అంశంపై అన్ని పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. బీజేపీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే రాజగోపాల్ లాంటి ముఖ్యమైన నేతల రాకను ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. త్వరలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించడంతో ఆయన పార్టీ మార్పు దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది. అయితే, వచ్చే వారు ఊరికే కాకుండా టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహంతో రావాలనేది బీజేపీ కండీషన్‌గా తెలుస్తోంది. అంటే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలనేది కమలం పార్టీ ఎత్తుగడగా విశ్లేషణలు వస్తున్నాయి.

కేసీఆర్ వద్ద ప్లాన్-బీ?

కేసీఆర్‌కు వ్యక్తిగతంలో ఉప ఎన్నికలు కొత్తేమీ కాదు. నిజం చెప్పాలంటే ఆయన్ను ప్రజల్లో ఇంతటి వాడిని చేసింది కూడా ఉప ఎన్నికలే అనే పేరు ఉంది. కానీ, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో వస్తున్న ఉప ఎన్నిక పూర్తిగా భిన్నమైనది. గతంలో కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్లినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ప్రధాన అస్త్రం. కానీ, ఇక్కడ రాజకీయ బలనిరూపణే కీలక అంశం. సో.. అన్ని పార్టీలు తమ శక్తి వంచన లేకుండా రాజకీయాలు చేస్తాయి. ప్రజలు కూడా ఆ మేరకే తీర్పు ఇస్తారనేది వాస్తవం. బీజేపీ మాత్రం టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి కాషాయ కండువా కప్పబోతోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఏక కాలంలో ముడు నాలుగు స్థానాలకు ఉప ఎన్నిక వస్తే అది టీఆర్ఎస్‌కు పెద్ద సవాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే కేసీఆర్ తన ప్లాన్-బీ అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ కాని అతనితో పాటు మరి కొందరు కాని రాజీనామా చేస్తే ఆ రాజీనామాలను ఆమోద ముద్ర వేయకుండా కాలయాపన చేసే అవకాశం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలమైన అంశం అనే మాట రాజకీయవ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈటల విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్త?

ఈటల విషయంలో టీఆర్ఎస్ వెనువెంటనే రియాక్ట్ అయింది. 2021 జూన్ నెలలో ఎమ్మెల్యే పదవికి ఉదయం రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందిస్తే ఆ వెంటనే రాజీనామాను స్పీకర్ ఆమోద ముద్ర వేసి హుజూరాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఇదంతా గంటల వ్యవధిలో జరిగిపోయిన వ్యవహారం. కానీ ఇక్కడ టీఆర్ఎస్ భంగపాటుకు గురైంది. గెలుస్తామని భావించినా.. ప్రజల మద్దతు ఈటలకే దక్కింది. పక్క రాష్ట్రం ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా పత్రం సమర్పించినా ఇంకా ఆమోద ముద్ర పడలేదు. ఏడాది దాటుతున్నా తన రాజీనామా ఆమోదం తెలపలేదని ఇకనైనా తన రాజీనామా లేఖకు ఓకే చెప్పాలని గంటా ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం కు లేఖలు రాసిన వైనం అందరికీ తెలిసిందే. ఆ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వమే ఆమోద ముద్రవేయకుండా ఆపుతోందనే విమర్శలు ఉన్నాయి. అయితే, రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌లోనూ కేసీఆర్ ఇలాంటి నిర్ణయంతోనే నిర్ణయంతో కేసీఆర్ ఉన్నారనే చర్చ తెరపైకి వస్తోంది.

అనుకూలమైన సందర్భంలో ఆమోదం?

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందనేది అందరికీ తెలిసిన విషయమే. వరుస ఫలితాలతో పాటు పార్టీకి వస్తున్న ఆదరణ చూస్తే ఇట్టే ఈ విషయం అర్థం అవుతుంది. కానీ, రాజగోపాల్ రెడ్డి విషయంలో మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి బలమైన రాజకీయ శక్తి. అలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న సమీకరణం మారినా ఫలితం తారుమారు అవుతుందనేది అన్ని పార్టీలకు తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ మునుగోడుకు ఉపఎన్నిక వస్తే దాని ఫలితం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ప్లాన్‌లో భాగంగా ఇకపై పార్టీకి ఎగనెస్ట్‌గా వచ్చే రాజీనామాలు ఆచితూచి ఆమోద ముద్రవేసే ఆలోచనలో ఉందట. ఒకవేళ రాజీనామా చేస్తే ఆలోపు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నాకే ఆ రిజైన్ లెటర్‌ను యాక్సెప్ట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మరి రాజకీయ ఎత్తుగడలను వేయడంలో అపార అనుభవం కలిగిన కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌లో రాజీనామా లేఖ స్పీకర్‌కు అందితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారనుంది.

Advertisement

Next Story