పోలవరం.. అమరావతి ఏపీకి రెండు కళ్లు: చంద్రబాబు

by Vinod kumar |
పోలవరం.. అమరావతి ఏపీకి రెండు కళ్లు: చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: 'తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది. రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు టీడీపీ పాలనలోనే అందాయి. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే. అనేక సామాజిక మార్పులకు టీడీపీ ఆవిర్భావమే కారణం. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షం గా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీయే' అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు.


టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో లోగో ఆవిష్కరించారు. నలభై వసంతాల వేడుకలను వాడవాడలా జరపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'జగన్‌ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చింది. పోలవరానికి మిగతా రూ.40 వేల కోట్లు రాష్ట్రం భరిస్తుందా? పోలవరం పూర్తి చేయాలని గతంలో ఢిల్లీ పెద్దలకు గట్టిగా చెప్పాం. పోలవరంపై సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్దాలే. డయాఫ్రమ్‌ వాల్‌ ఎప్పుడు పూర్తవుతుంది? 2023లో పోలవరం నుంచి నీళ్లు ఎలా ఇస్తారు?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఆవిర్భావ వేడుకలు..

'తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీ వాడవాడల్లో పార్టీ కార్యక్రమాలు జరిపేందుకు పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నలభై వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి లోగోను ఆవిష్కరించడం జరిగింది' అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు జాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం అని చెప్పుకొచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ అనతికాలంలోనే జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసింది అని చంద్రబాబు తెలిపారు.


టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ రోజున గ్రామ గ్రామాన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణలు చేపట్టాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని క్యాడర్‌కు చంద్రబాబు సూచించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో నాడు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ప్రాంతాన్ని సందర్శిస్తామని...అనంతరం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పిస్తామని చంద్రబాబు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాలకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా హాజరవుతారని చంద్రబాబు స్పష్టం చేశారు.

జగన్ తప్పులే పోలవరానికి శాపం..

'రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం వల్ల అంత మంది చనిపోతే కనీసం చర్చ పెట్టలేదుని రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా అవుతుంది. కొన్ని బ్రాండ్ల మద్యం ఏపీలో కన్పించకుండా పోవడానికి కారణం అదే. కిళ్లీ కొట్టులో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఎందుకు అమలు చేయడం లేదు. మద్యం విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదు. కల్తీ సారా వల్ల 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా?' అని చంద్రబాబు మండిపడ్డారు. 'మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారు.. దీనిపై ప్రజల్లోకి వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరానికి అన్యాయం జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 15,600 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పింది. ఆ నిధులతో ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారు. జగన్ చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయ్యింది. టీడీపీ హయాంలో పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులిస్తామని నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. పోలవరం విషయంలో సీఎం జగన్ నంగి నంగి మాట్లాడుతున్నారు. మిగిలిపోయిన కాఫర్ డ్యామ్ పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే.. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేది కాదు. తప్పులు అన్నీ జగన్ చేసి. .ఇప్పుడు టీడీపీపై తోస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసిన దరిద్రపు పనికే డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. పోలవరం- అమరావతి ఏపీకి రెండు కళ్లు అయితే.. ఆ రెండు కళ్లను సీఎం జగన్ పొడి చేశారు' అని చంద్రబాబు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed