నిద్దుర‌పోతున్న నిఘా నేత్రాలు.. స‌ర్వత్రా విమ‌ర్శలు

by S Gopi |
నిద్దుర‌పోతున్న నిఘా నేత్రాలు.. స‌ర్వత్రా విమ‌ర్శలు
X

దిశ‌, క‌రీమాబాద్: అత్యంత స‌మ‌స్యాత్మక ప్రాంతాలు ఎక్కువ‌గా క‌లిగి ఉన్న మిల్స్ కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నిఘా నేత్రాలు నిద్దుర‌పోతున్నాయి. అనేక చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప‌నిచేయ‌డం లేదు. అయినా పోలీస్ అధికారులు పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌డిచిన కొద్దికాలంగా స్టేష‌న్ ప‌రిధిలో దొంగ‌త‌నాలతో పాటు ఇత‌ర క్రైం ఓరియెటెండ్ నేరాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి సీసీ కెమెరాలు ప‌నిచేసి ఉంటే కేసుల విచార‌ణ‌కు దోహ‌దం చేసే విధంగా ఉండేద‌న్న అభిప్రాయం పోలీస్ స్టేష‌న్ సిబ్బంది నుంచే వ్యక్తమ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఏర్పాటు చేయించిన‌వే.. కొత్తగా ఏం లేవు...

ప్రస్తుత సీఐ కంటే ముందు ప‌నిచేసిన అధికారులు స్టేష‌న్ ప‌రిధిలో కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత కొత్తగా ఏర్పాటు చేసింది లేద‌నే చెప్పాలి. గ‌తంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల‌ను ప‌ర్యవేక్షించ‌క‌పోవ‌డం, చిన్న చిన్న మ‌ర‌మ్మతులను సైతం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో నిఘా నేత్రాలు ప‌నిచేయ‌డం లేదు. సీసీ కెమెరాల‌ను అమ‌ర్చుకోవాల‌ని వ్యాపారుల‌కు సూచిస్తున్న పోలీస్ అధికారులే వాటి నిర్వహ‌ణ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంపై స‌ర్వత్రా విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు నెల 21వ తేదీన రాత్రి మిల్స్ కాలనీ పరిధిలోని దుపాకుంట రోడ్ లో ఫైనాన్షియర్ కొక వెంకటరావు హత్య జ‌రిగింది. అయితే ఈ హత్యను ఛేదించ‌డానికి క‌నీసం 30 నుంచి 40 రోజులు ప‌ట్టింది. వాస్తవానికి ఈ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నా.. ప‌నిచేయ‌డం లేదు. నిఘా నేత్రాలు ప‌నిచేసిన‌ట్లయితే రెండుమూడు రోజుల్లోనే కేసు ఛేద‌న పూర్తయి.. అన‌వ‌స‌ర‌మైన శ్రమ త‌ప్పేద‌ని స్టేష‌న్ సిబ్బందియే పేర్కొంటున్నారు.

వ‌రుస‌ దొంగ‌త‌నాలు...

40వ డివిజన్ ప‌రిధిలో గ‌త కొద్దిరోజులుగా వ‌రుస‌గా దొంగ‌త‌నాలు జ‌రుగుతున్నాయి. ఉర్సు ప్రతాప్ నగర్ సిద్దార్థ నగర్ ప్రాంతాలలో నివసిస్తున్న రాయిశెట్టి సాగర్, ఆకుతోట పుష్ప లీల, వగిలిశెట్టి రవీందర్, బానోత్ వెంకన్న గౌడ కుమారస్వామి ఇళ్ల తాళాల‌ను ప‌గుల‌గొట్టిన దుండ‌గులు సొత్తును దోచుకెళ్లారు. మిల్స్ కాల‌నీలో ఫిర్యాదు చేసిన బాధితుల‌కు ఇప్పటి వ‌ర‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించ‌డంలో అధికారులు చూపుతున్న అల‌స‌త్వంతో నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. నేర‌గాళ్లను ప‌ట్టుకోవ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌వుతున్నార‌న్న ఆగ్రహం ప్రజ‌ల నుంచి వ్యక్తమ‌వుతోంది. మ‌రి ఇప్పటికైనా మిల్స్ కాల‌నీ స్టేష‌న్ ప‌రిధిలో పాత వాటికి మ‌ర‌మ్మతులు, కొత్తగా సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసేలా, చేయించేలా అధికారులు చ‌ర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed