జాతీయ ఉద్యానవనంలో 'బోట్ లైబ్రరీ'!

by Manoj |   ( Updated:2022-06-16 08:21:52.0  )
జాతీయ ఉద్యానవనంలో బోట్ లైబ్రరీ!
X

దిశ, ఫీచర్స్ : ఒడిశాలోని భితార్కానికా నేషనల్ ఫారెస్ట్‌లో భారతదేశపు మొట్టమొదటి బోట్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. అడవికి ప్రవేశ ద్వారమైన దంగమల్ వద్ద ఈ లైబ్రరీని ఏర్పాటు చేయగా.. ఇక్కడకు వచ్చే సందర్శకులు, పిల్లలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించవచ్చు.

672 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న భితార్కానికా వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని రెండో అతిపెద్ద మడ అడవుల పర్యావరణ వ్యవస్థ. కాగా ఇక్కడి సరస్సులో ఉపయోగించే పడవ పాడవడంతో దాన్ని స్వాధీనం చేసుకున్న భితార్కానిక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జె డి పతి ఆధ్వర్యంలో 'బోట్ లైబ్రరీ' రూపొందించేందుకు ప్రణాళిక వేశారు. గ్రౌండ్ నుంచి పడవలోనికి చేరుకునేందుకు మెట్లు సహా, లోపల పుస్తకాలను చక్కగా అమర్చేందుకు షెల్ఫ్‌లను డిజైన్ చేశారు. ఈ బోట్ లైబ్రరీలో మొత్తంగా సుమారు 1500 పుస్తకాలను ప్లేస్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భితార్కానికా ఎకో-టూరిజం అండ్ ఎకో-డెవలప్‌మెంట్ సొసైటీ (బీడ్స్) వీటికి నిధులు సమకూర్చింది. ఈ జాతీయ ఉద్యానవనం మొసళ్లకు ప్రసిద్ధి చెందగా, వాటి మేటింగ్ కోసం ప్రతీ ఏటా మే 1 నుంచి జూలై 31 వరకు మూసివేస్తారు. దీంతో ప్రస్తుతానికి స్థానిక పాఠశాలల పిల్లలను లైబ్రరీని సందర్శించేందుకు అనుమతిస్తు్న్నారు.

డిజైన్ అండ్ బుక్స్

పుస్తకాలను ఉంచేందుకు పడవలో 32 కంపార్ట్‌మెంట్‌లతో కూడిన ఒక గదిని రూపొందించారు. మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు సంబంధించిన పుస్తకాలు సహా కార్డ్ గేమ్‌లతో పాటు ఒడియా, హిందీ, ఇంగ్లీషు చిత్రాల పుస్తకాలు ఉన్నాయి. ఇక ఐదు నుంచి పదేళ్ల మధ్య పిల్లల కోసం జానపద కథలు, షార్ట్ స్టోరీస్ పుస్తకాలున్నాయి. 10 నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల కోసం ఎన్‌సైక్లోపీడియాలు, ప్రకృతి, పరిరక్షణ, అట్లాస్, సైన్స్ ప్రాజెక్ట్స్ సహా ప్రముఖుల జీవిత చరిత్ర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 15 ఏళ్లు పైబడిన వారి కోసం కూడా పలు బుక్స్ ఉంచారు. వన్యప్రాణుల సంరక్షణ, మడ అడవులు, జీవావరణ శాస్త్ర బుక్స్ సహా ప్రభుత్వ బ్రోచర్స్, చిత్తడి నేల సంరక్షణపై ప్రచురణలు ఉన్నాయి.

'ప్రకృతి, పర్యావరణ వ్యవస్థ, జీవావరణ శాస్త్రం, వన్యప్రాణులకు సంబంధించిన చాలా పుస్తకాలకు లైబ్రరీలో స్థానం కల్పించాం. ఈ ప్రయత్నం బాగుందని స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. పర్యావరణం చిత్తడి నేలలపై పిల్లల్లో ఆసక్తిని కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి స్పందన లభిస్తే మరిన్ని పుస్తకాలను కొలువుతీర్చేందుకు మేం సిద్ధం. వేసవి సెలవులు సహా మిగతా అన్ని రోజుల్లోనూ బోట్ లైబ్రరీ తెరిచి ఉంటుంది. ప్రతీ ఆదివారం, రెండు నుంచి మూడు పాఠశాలల విద్యార్థులను బోట్ లైబ్రరీని సందర్శించేందుకు అనుమతిస్తున్నాం. అంతేకాదు స్థానిక పాఠశాలలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

పిల్లలతో పాటు యువతను ప్రకృతితో అనుసంధానం చేయడం, పరిరక్షణ గురించి వారిలో చైతన్యం కలిగించడమే మా లైబ్రరీ లక్ష్యం. మడ అడవులు, చిత్తడి నేలలను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని ప్రతీ ఒక్కరు గ్రహించాలి.

- జె డి పతి, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్

Advertisement

Next Story

Most Viewed