'మినీకూపర్' ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసిన బీఎండబ్ల్యూ!

by Disha Desk |
మినీకూపర్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసిన బీఎండబ్ల్యూ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ మినీకూపర్ ఎస్ఈని గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 47.20 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. పూర్తిగా దిగుమతి చేసుకున్న ఈ మోడల్ 50 కిలోవాట్ ఛార్జింగ్ పాయింట్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో వేగవంతంగా 0-80 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో పదేళ్లుగా కాంపాక్ట్ ప్రీమియం సెగ్మెంట్‌లో మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారుగా మినీకూపర్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషంగా ఉందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా అన్నారు. కంపెనీ నుంచి వచ్చే ఏ11 కిలోవాట్ వాల్‌బాక్స్ ద్వారా ఈ మోడల్‌ను 150 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చని, పూర్తిగా ఛార్జింగ్ అవడానికి 210 నిమిషాలు పడుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లోకి 30 యూనిట్లు వచ్చాయి. ఇవి కూడా గతేడాది చివర్లో ప్రీ-బుకింగ్ ద్వారా అమ్ముడయ్యాయి. వీటి డెలివరీలను ఈ ఏడాది మార్చి నుంచి ప్రారంభిస్తామని, తర్వాతి బుకింగ్ కూడా అదే సమయంలో ఉండే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed