ఈ వేసవికి 5 శాతం పెరగనున్న ఏసీల ధరలు!

by Vinod kumar |
ఈ వేసవికి 5 శాతం పెరగనున్న ఏసీల ధరలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో వేసవికి డిమాండ్ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఎయిర్ కండీషనర్ల(ఏసీ) ధరలు దాదాపు 5 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని దేశీయ తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో, గత రెండు సీజన్లలో కొవిడ్-19 మహమ్మారి లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఏసీ తయారీ కంపెనీలు ఈ ఏడాది పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధించగలదని ఆశిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ విభాగం ఇటీవల అంచనాలతో వోల్టాస్, హిటాచీ, ఎల్‌జీ, పానసోనిక్, గోద్రేజ్ ఏసీ, గృహోపకరణాల తయారీ కంపెనీలు డిమాండ్ మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నాయి.


గిరాకీ ఎక్కువగా ఉన్నప్పటికీ సరఫరా కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని, దీనివల్ల కొంత ఒత్తిడిని ఎదుర్కొనక తప్పదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. గత త్రైమాసికంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల విడిభాగాలు, రాగి, అల్యూమినియం వంటి మెటల్, పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీలు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే కొనుగోళ్లపై ప్రభావం పడకుండా ఆఫర్లు, సులభమైన ఈఎంఐ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఏడాది మొత్తానికి జరిగే అమ్మకాల్లో వేసవిలో జరిగే అమ్మకాల వాటానే 35-40 శాతం ఉంటుంది.


అయితే, ధరల పెంపు కొంత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ దారుల సంఘం(సీఈఏఎంఏ) హెచ్చరించింది. గత 18 నెలల్లో వినియోగదారు ఉపకరణాల పరిశ్రమ 15 శాతం మేర ధరలను పెంచింది. పరిశ్రమ ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరల పెరుగుదల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటోందని సీఈఏఎంఏ అభిప్రాయపడింది. అయితే, ధరల పెరుగుదల తక్షణమే వినియోగదారులపై పడదు. ప్రస్తుతం విక్రయించడానికి అవసరమైన ఉత్పత్తుల తయారీ పూర్తయింది. మే తర్వాత నుంచి ఉత్పత్తులపై ధరల్లో మార్పులు ఉంటాయని సీఈఏఎంఏ అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా అన్నారు.

Advertisement

Next Story