నిశ్చితార్థానికి వెళ్లోస్తూ.. ఆ కేసులో పోలీసులకు పట్టుబడ్డ యువకుడు ఆత్మహత్య

by Manoj |
నిశ్చితార్థానికి వెళ్లోస్తూ.. ఆ కేసులో పోలీసులకు పట్టుబడ్డ యువకుడు ఆత్మహత్య
X

దిశ, దస్తురాబాద్ : నిశ్చితార్థానికి వెళ్లోస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డ ఓ యువకుడు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొడిసేర్యాల గోండుగూడా గ్రామానికి చెందిన మాడవి నాగరాజు(19) ఈ నెల 13న వివాహ నిశ్చితార్థం కార్యక్రమం ముగించుకొని.. ఆదివాసులు గ్రామ సమీపంలో వారి సాంప్రదాయ ప్రకారం మద్యం సేవించి గ్రామానికి వస్తున్న క్రమంలో దస్తురాబాద్ ఎస్‌ఐ జ్యోతి మణి విధి నిర్వహణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. మద్యం తాగి వాహనం నడపడం రుజువు కావడంతో ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న నాగరాజును బైకు ఏదని అడిగారు. నాగరాజు విషయం మొత్తం వివరించడంతో అతని తల్లిదండ్రులు కోప్పడ్డారు. జరిమానాకు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయని అనడంతో మనస్తాపం చెందిన నాగరాజు అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు వెంటనే అతనిని జన్నారం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ చేయి చేసుకోవడం వల్లనే మాడవి నాగరాజు మృతి చెందాడని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. దీంతో తుడుందెబ్బ నాయకులు గ్రామానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ధర్నా నిర్వహించేందుకు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకొని ఆదివాసులతో చర్చించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడం, ఖానాపూర్ ఎస్‌ఐలు, ఖానాపూర్ సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.



Advertisement

Next Story

Most Viewed