AP News: ప్రపంచంలో ఏ ప్రాజెక్టు అయిన అంతే.. ఒక్కసారిగా ఏది పూర్తి కాదు: అంబటి రాంబాబు

by Manoj |   ( Updated:2022-04-15 14:10:50.0  )
AP News: ప్రపంచంలో ఏ ప్రాజెక్టు అయిన అంతే.. ఒక్కసారిగా ఏది పూర్తి కాదు: అంబటి రాంబాబు
X

దిశ,ఏపీ బ్యూరో: ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినా కొన్ని దశలలో పూర్తి చేస్తారని, ఒక్కసారిగా ఏ ప్రాజెక్ట్‌ పూర్తికాదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టులు దశలవారీగానే జరిగాయన్నారు. అదేవిధంగా పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ కమిటీ) కూడా కలిసి ఒక నిర్ణయం ప్రకారం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తారన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యాం సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

పోలవరం ప్రాజెక్ట్‌‌‌ 45.72 మీటర్లు ఎత్తులో మొత్తం కెపాసిటీ నిండుతుందన్నారు. అంత కెపాసిటీలో ఒకేసారి నీళ్ళు నింపి పునరావాసం కల్పించడం సాధ్యం కాదన్నారు. కాబట్టి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ దానిని రెండు దశలుగా డివైడ్‌ చేశారని పేర్కొన్నారు. 41.15 మీటర్లకు ఏఏ గ్రామాలు అయితే ముంపునకు గురి అవుతాయో ముందుగా ఆ గ్రామాలకు పునరావాసం పూర్తి చేసి, 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి ప్రాజెక్ట్‌ను పరీక్షిస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు పురగోతి 1.46 శాతం మాత్రమేనని, ఇసుక కోతకు, గుంతలు పూడ్చేందుకు, డ్రెజ్జింగ్‌ పరిష్కారంగా 800 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఓపత్రిక పెద్ద బ్యానర్‌ వార్తను వ్యంగ్యంగా రాసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పై విషం చిమ్మి, ప్రజల్లో ఒక గందరగోళం కల్పించే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తుందని ఆరోపించారు. మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

సీఎం జగన్‌ నిత్యం ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనుల వల్లే రూ.800కోట్లు మళ్లీ తిరిగి ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. దీనికి కారకుడు చంద్రబాబేనని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎంగా ఉపయోగించుకున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అన్నారని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, కాంట్రాక్టర్లతో పనులు చేయించడం, అందులో కమిషన్లు తీసుకుని టీడీపీ నాయకులు పోలవరం ప్రాజెక్ట్‌‌‌ను ఆదాయ వనరుగా మర్చుకున్నారని ఆరోపించారు. 20 మీటర్ల మందం దిగువ కాఫర్‌ డ్యామ్‌ మైనస్‌ 22.5 మీటర్ల వరకూ కోతకు గురైందన్నారు. దీంతో వాటి మరమ్మతుల నిమిత్తం అదనంగా 800 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చిందన్నారు. పోరస్‌ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అందరికి తెలిసిందేనని అన్నారు.

గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఎలా స్పందించాయి? ఇప్పటి మా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది బేరిజు వేసుకొవలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ప్రభుత్వం నుంచి రూ.25లక్షలు, ఫ్యాక్టరీ తరపున రూ.25 లక్షలు పరిహారం అందించిందని తెలిపారు. టీడీపీ హయాంలో ఇలా ఎప్పుడైనా పరిహారం అందిందా? అని ప్రశ్నించారు. ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవడంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గతంలో విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తీవ్రతను బట్టి, బాధిత కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారం అందించమని గుర్తుచేశారు.

Advertisement

Next Story