22 కిలోమీటర్ల హై స్పీడ్ చేజ్.. కాల్పులు చేసి మరీ పట్టుకున్న పోలీసులు

by Javid Pasha |
22 కిలోమీటర్ల హై స్పీడ్ చేజ్.. కాల్పులు చేసి మరీ పట్టుకున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ హైస్పీడ్ చేజ్‌లు, కాల్పులు ఇవన్నీ దాదాపు సినిమాల్లోనే చూసుంటాం. బయట నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు. పోలీసులు సైతం తమ గన్నును పేల్చేందుకు ఆలోచిస్తారు. కానీ తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పోలీసులకు, స్మగ్లర్లకు మధ్య భారీ చేజ్ చోటు చేసుకుంది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటన గుర్గావ్ సైబర్ సిటీ దగ్గర్లో శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఇందులో దాదాపు 22 కిలోమీటర్ల మేరా హైస్పీడ్ చేజ్ జరిగింది. అంతేకాకుండా పోలీసులు స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్‌పై కాల్పులు కూడా చేశారు. స్మగ్లర్లు కూడా పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు తమ ట్రక్ నుంచి గోవులను కింద పడేయడం ప్రారంభించారు.

ఎట్టకేలకు భారీ హైస్పీడ్ చేజ్ తర్వాత పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమకు పశువుల స్మగ్లింగ్ జరుగుతున్న పక్కా సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లామని, అప్పటికే పశువులను ట్రక్‌లో ఎక్కించి వారు ప్రయాణం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. అయితే ముందుగా స్మగ్లర్లు 7 ఆవులను ట్రక్‌లో స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో విజిలాంటీస్ అధికారులు వారిని వెంబడించారని, ఈ క్రమంలో అధికారులపై స్మగ్లర్లు కాల్పులు జరిపారు. దాంతో విజిలంటీస్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారని అధికారులు చెప్పారు. దాంతో చేజ్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో 22 కిలోమీటర్లు హైస్పీడ్ చేజ్ జరిగిందని, ఎదురుకాల్పులు సైతం జరిగాయని పోలీసులు వెల్లడించారు. అయితే తాము అదుపులోకి తీసుకున్న వారు యహ్య, బల్లు, తస్లీం, ఖలీద్, సాహిద్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారి నుంచి కొన్ని స్థానికంగా తయారు చేసిన గన్నులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story