కాంగ్రెస్‌లో విలీనం తర్వాత YS షర్మిలకు రాజ్యసభ!

by GSrikanth |   ( Updated:2023-06-23 03:06:32.0  )
కాంగ్రెస్‌లో విలీనం తర్వాత YS షర్మిలకు రాజ్యసభ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ షర్మిల ప్రారంభించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు వస్తున్న వార్తలు రోజురోజుకూ బలపడుతున్నాయి. విలీనం చేయాలన్న నిర్ణయం దాదాపుగా ఖరారైందని, దానికి ప్రత్యామ్నాయంగా ఆమెకు ఆఫర్ విషయంలోనూ స్పష్టత వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌తో జరిగిన చర్చల అనంతరం ఆమెను ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎమ్మెల్యే కోటా కింద పంపించడానికి కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతల విషయంలో తెలంగాణకు బదులుగా ఆమె సేవలను ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకునే అవకాశం ఉన్నది.

మరో పార్టీలో విలీనం చేయడానికి తాను కొత్త పార్టీ పెట్టలేదని, తన పార్టీ ఎప్పటికీ వైఎస్సార్టీపీగానే కొనసాగుతుందంటూ ఇటీవల మీడియాతో షర్మిల వ్యాఖ్యానించినా లేటెస్ట్ డెవలప్‌‌మెంట్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ పర్యవేక్షంలో విలీనానికి సంబంధించిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చినా విలీనం చర్చల తర్వాత మాత్రం రాజ్యసభ సభ్యురాలిగా ఆమెను పంపించే దిశగా క్లారిటీ వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పోటీ చేయడమో లేక పార్టీ వ్యవహారాల్లో పాలుపంచుకునే అవకాశాలు తక్కువేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆమె సర్వీసును వినియోగించుకోవడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమైంది.

తెలంగాణ పేరుతో పార్టీ పెట్టినా, రాష్ట్రమంతా పాదయాత్ర చేసి గుర్తింపు తెచ్చుకున్నా ఆమెపైన ఏర్పడిన రాయలసీమ ముద్ర పోలేదని, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత తెలంగాణలోనే ఆమె పార్టీ వ్యవహారాల్లో భాగస్వామ్యమైతే కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే ప్రమాదాన్ని ఇప్పటికే తెలంగాణ పీసీసీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే షర్మిల విలీన ప్రయత్నాలపై మౌనంగా ఉన్నా తెలంగాణలో పార్టీ కార్యక్రమాల్లో వీలైనంత వరకు ఆమె పాల్గొనకుండా చేయడం ద్వారా విమర్శలు రాకుండా చూసుకోవచ్చని డీకే శివకుమార్‌తో పాటు ఏఐసీసీ నాయకులకు తెలంగాణ పీసీసీ నేతలు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీనితో ఏకీభవించిన తర్వాత ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం చేయడానికే మొగ్గు చూపినట్లు తెలిసింది.

అటు కాంగ్రెస్ నేతలు గానీ, ఇటు షర్మిల గానీ విలీనంపై స్పష్టత ఇస్తేనే ఊహాగానాలకు ముగింపు లభిస్తుంది.

Also Read:

పోలవరానికి 'జె' గ్రహణం!

కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం.. జగన్ వ్యూహంలో భాగమా?

Advertisement

Next Story