కాంగ్రెస్‌లో పొంగులేటి ‘కీ’ రోల్.. టాస్క్ ​పూర్తి చేయడంలో సక్సెస్..!

by GSrikanth |   ( Updated:2023-09-14 02:57:51.0  )
కాంగ్రెస్‌లో పొంగులేటి ‘కీ’ రోల్.. టాస్క్ ​పూర్తి చేయడంలో సక్సెస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ వేదికగా ఈ నెల 16, 17న జరిగే సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ) మీటింగ్‌లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీ రోల్ పోషించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ ముఖ్య కమిటీల్లో కీలక బాధ్యతల్లో ఉన్న పొంగులేటికి... కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్‌లోనూ మరో ముఖ్యమైన పోస్టును అప్పగించారు. సీడబ్ల్యూసీ పబ్లిసిటీ, బ్రాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. దేశ వ్యాప్తంగా జాతీయ నాయకులు హాజరయ్యే ఈ మీటింగ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్, ‘తిరగబడదాం... తరిమికొడదాం’ కార్యక్రమాల కోసం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పొంగులేటికి మరో అదనపు బాధ్యతను ఇస్తూ పార్టీ ఆదేశాలిచ్చింది. దీంతో పొంగులేటికి పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. గతంలో ఏ పార్టీలోనూ ఇవ్వని పదవులు ఇవ్వడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరింత చొరవ చూపిస్తానని ఆయన ధీమాతో ఉన్నారు.

రాహుల్ సభ సక్సెస్‌లో కీలకం

జూలై 2న కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ చేయడంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేపట్టినా... పొంగులేటి తనదైన శైలిలో సభను విజయవంతం చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. జన సమీకరణకు అడుగడుగునా... అడ్డంకులు సృష్టించినా.. పొంగులేటి తన వ్యూహాలతో పబ్లిక్‌ను జమ చేశారు. రాహుల్ గాంధీ చీఫ్​గెస్టుగా వచ్చిన ఈ సభ జనసందోహంతో కళకళలాడింది. రెండు లక్షల మంది టార్గెట్ పెట్టుకోగా.. దాదాపు ఐదారు లక్షల మంది జనం ఈ సభకు హాజరైనట్లు గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. జన సందోహాన్ని చూసి స్వయంగా ఏఐసీసీ రాహుల్ గాంధీ పొంగులేటి సభ వేదిక సాక్షిగా అభినందించారు. ‘వారెవ్వా పొంగులేటి జీ’ సూపర్ అంటూ కితాబు ఇచ్చారు. దీన్ని కాంప్లిమెంట్‌గా తీసుకున్న పొంగులేటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యక్రమాలను విజయవంతం చేయడంతో శ్రీనివాసరెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జన బలం కలిగిన నేత కావడంతో ఇచ్చిన టాస్క్‌ను విజయవంతం చేయడంతో పొంగులేటికి సులువుగా మారుతుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

200 మంది జాతీయ నాయకులు

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీలు, సీఎల్పీలు తదితర నేతల్లో దాదాపు 200 మంది ఈ సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరు కానున్నట్లు సమాచారం. తెలంగాణలో మొదటి సారిగా జరిగే ఈ మీటింగ్‌లను గ్రాండ్ సక్సెస్ చేయాలని రాష్ట్ర పార్టీ కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నది. దీనిలో భాగంగానే దేశ వ్యాప్త నాయకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు, పార్టీ బ్రాండింగ్ ఇమేజ్‌లను ప్రదర్శించనున్నారు. దీంతో పార్టీ నాయకులను స్వాగతం పలికేందుకు అవసరమైన కాన్వాయ్ బ్రాండింగ్ వంటివి సమకూర్చనున్నారు. ఇవన్నీ సక్సెస్ చేయాలంటే పొంగులేటితోనే సాధ్యమని భావించిన పార్టీ ఆయనకు చైర్మన్‌గా అవకాశం ఇవ్వడం గమనార్హం.

గాలి అనిల్ కుమార్ కో-చైర్మన్

పార్టీలో కీలక నాయకుడైన గాలి అనిల్ కుమార్‌ను పబ్లిసిటీ, బ్రాండింగ్ కమిటీ కో-చైర్మన్‌గా నియమించింది. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో పొంగులేటి, అనిల్ కుమార్ ఇద్దరు నేతలు సమన్వయంతో బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు మరింత పెరిగేలా ఈ కమిటీ పబ్లిసిటీ చేయనున్నది. కో-చైర్మన్ బాధ్యతలిచ్చినందుకు ఆయన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story