వద్దని చెప్పినా సినీ నటుడికి టికెట్ కేటాయించిన బీజేపీ

by GSrikanth |   ( Updated:2023-11-02 10:00:46.0  )
వద్దని చెప్పినా సినీ నటుడికి టికెట్ కేటాయించిన బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, బీజేపీ కీలక నేత బాబూ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ప్రకటించిన బీజేపీ థర్డ్ లిస్ట్‌లో ఆయనకు అధిష్టానం ఆందోల్ టికెట్ ఖరారు చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇటీవల ఆయన మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. ఇటీవల బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ పెద్దల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు లేదో తనకు తెలియదన్నారు. మొదట్లో తన కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి తనకు, తన కుమారుడు ఇద్దరిలో ఒక్కరికీ కూడా టికెట్ ఇవ్వకపోగా సామాజిక మాధ్యమాల్లో ఇద్దరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేసిన వారికే పెద్దలు టిక్కెట్లు ఇవ్వాలని ఆయన కోరారు.


బీజేపీలో తనకు చాలా అవమానాలు జరిగాయని తాను ఫోన్ చేస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోయారు. కావాలనే కొందరు తనను పార్టీ నుండి బయటికి పంపడానికి ప్రయత్నిస్తున్నారని బాబు మోహన్ విమర్శలు గుప్పించారు. తాను పదవుల కోసం ఆశపడి పార్టీలో చేరలేదని, తాను అన్నీ పదవులు అనుభవించానని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ తనను ఆదరించిన ఆందోల్ ప్రజలు తనను క్షమించాలని బాబు మోహన్ కోరారు. తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పనిచేసే అవకాశం ఆందోల్ ప్రజలు కల్పించారన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పోటీ కానీ, ప్రచారం కానీ చేయనని వెల్లడించారు. అయితే, తాజాగా.. బాబూ మోహన్ మాట్లాడిన వీడియో క్లిప్స్‌ను షేర్ చేసి వద్దన్నా.. బాబూ మోహన్‌కు టికెట్ కేటాయించారని బీజేపీపై ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story