అలర్ట్‌గా ఉండండి.. పోలీసులతో డీజీపీ టెలీ కాన్ఫరెన్స్

by GSrikanth |
అలర్ట్‌గా ఉండండి.. పోలీసులతో డీజీపీ టెలీ కాన్ఫరెన్స్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కౌంటింగ్​నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్​సూచించారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఇన్నాళ్లూ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని అన్నారు. నేడు రాష్ర్టవ్యాప్తంగా 49 సెంటర్లలో ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో ఆయా కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో శనివారం ఉదయం డీజీపీ అంజనీకుమార్​టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కౌంటింగ్​కేంద్రాల వద్ద పరిస్థితిని ఆయా యూనిట్ల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా పార్టీల కార్యకర్తలు కౌంటింగ్​సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశాలు ఉంటాయన్నారు. లెక్కింపు చివరి దశకు చేరుకునే సమయంలో విజయం దిశగా సాగుతున్న అభ్యర్థులకు చెందిన అనుచరులు, ఓటమి పాలు కానున్న వారి కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు.

ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. స్పెషల్​బ్రాంచ్​సిబ్బందిని రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. అవసరమనుకున్న పక్షంలో మొబైల్​యూనిట్ల సంఖ్యను పెంచాలని సూచించారు. కౌంటింగ్​పూర్తయిన తరువాత గెలిచిన, ఓడిన పార్టీలకు చెందిన వారు ప్రత్యర్థుల ఆస్తులపై దాడులు చేయటానికి అవకాశాలు ఉంటాయన్నారు. అప్పుడు రోడ్ల పక్కన ఉండే భవన నిర్మాణ సామాగ్రి వారికి ఆయుధాలుగా మారే ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో భవన నిర్మాణ సామాగ్రి అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో పనిచేసిన పోలీసుల కృషిని అభినందించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కౌంటింగ్​రోజున కూడా విధులు నిర్వర్తనలో అలర్ట్‌గా ఉండాలని చెప్పారు.

అన్ని కేంద్రాల్లో...

ఇక, కౌంటింగ్​జరుగనున్న 49 కేంద్రాల వద్ద అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే చర్యలు తీసుకోవటానికి ఫైరింజన్లు, ఫైర్​ఎస్టింగ్విషర్లు, సిబ్బందిని మోహరించనున్నట్టు అగ్నిమాపక శాఖ డీజీపీ నాగిరెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటానికి గంట ముందే సిబ్బంది ఆయా కౌంటింగ్​కేంద్రాల వద్దకు చేరుకుంటారన్నారు. లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా కౌంటింగ్​సెంటర్ల వద్దనే విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.

Advertisement

Next Story