కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు జరుగుతోంది: ప్రధాని మోడీ

by GSrikanth |
కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు జరుగుతోంది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కేసీఆర్ ఇలాఖా అయిన గజ్వేల్ నియోజకవర్గంలోని తుప్రాన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో బీజేపీ ప్రభుత్వం వచ్చాక చూపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం కుటుంబ లబ్ధి కోసమే కేసీఆర్ ప్రభుత్వంలోకి రావాలని తహతహలాడుతున్నాడని మండిపడ్డారు. మరోవైపు అమేథి నియోజకవర్గం నుంచి పారిపోయిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు నీతులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. అమేథి నుంచి రాహుల్, గజ్వేల్ నుంచి కేసీఆర్ పారిపోయారని తెలిపారు. నిరుద్యోగులు, మహిళలే కాకుండా రైతులు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని చెప్పారు. మల్లన్న స్వామి కూడా కోపంగా ఉన్నాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రాజెక్ట్‌ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అన్నారు. ఆ ప్రాజెక్టుల కోసం రైతుల వద్ద నుంచి భూమి లాక్కొని చిత్రహింసలకు గురిచేస్తారని గుర్తుచేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తామని బీఆర్ఎస్‌, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డాయని అన్నారు. కానీ, బీజేపీలో అలా ఉండదని రేపటి ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని అన్నారు. ఇన్నాళ్లు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను నమ్మించి కేసీఆర్ మోసం చేశారని వెల్లడించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయలేదని తెలిపారు.

ప్రజలను పట్టించుకోని సీఎం తెలంగాణకు అవసరమా? అని అడిగారు. కేసీఆర్‌ను శాశ్వతంగా ఫామ్‌హౌస్‌కు పరిమితం చేయాలని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు ఒకటే అని ఈ రెండు కుటుంబ పార్టీలే అని అన్నారు. కాంగ్రెస్ కార్బన్ కాపీయే బీఆర్ఎస్‌ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రెండు పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ పరువు, ప్రతిష్టలను బీజేపీ పెంచుతుందని అన్నారు. వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేయబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ సుల్తాన్ లాంటిది, బీఆర్ఎస్ పాలన నిజాం దొర లాంటిదని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై కూడా దర్యాప్తు జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed