Bangla Hindus : బంగ్లా హిందువులకు మద్ధతుగా భారత్ లో ఆందోళనలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-30 07:04:00.0  )
Bangla Hindus : బంగ్లా హిందువులకు మద్ధతుగా భారత్ లో ఆందోళనలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh)ప్రభుత్వం అరెస్టు చేసిన ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్‌(Chinmay Krishnadas)ను వెంటనే విడుదల చేయాలని, బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలన్న డిమాండ్లతో భారత్ లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌, ఇస్కాన్ ల ఆధ్వర్యంలో క్రమంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా సంస్థలు ఆందోళనల పర్వాన్ని ప్రారంభించాయి. హైదరాబాద్ లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌, ఇస్కాన్ ల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల, గుడుల రక్షణకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బంగ్లాలో హిందువులపై దాడులను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాని అవమానించారని చిన్మయ్ కృష్ణదాస్‌పై అభియోగం మోపారు. నవంబరు 25న చిన్మయ్‌ని ఢాకా ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. దేశద్రోహ ఆరోపణలపై జైలుకు పంపారు. దీంతో ఆయన మద్దతుదారులు, హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్మయ్ కృష్ణదాస్‌ తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది హత్యకు గురయ్యారు. చిన్మయ్ కృష్ణదాస్‌ని జైల్లోపెట్టాక.. ఇస్కాన్‌కి వ్యతిరేకంగా జమాతే కార్యకర్తలు బెదిరింపులకు దిగుతున్నారు. ఇస్కాన్ సంస్థను దేశంలో నిషేదించాలంటూ అల్టిమేటమ్ ఇవ్వడమే కాదు.. ఇస్కాన్ ఆలయ బోర్డు కూడా తీసేసి తమ సంస్థ బోర్డు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ కోర్టు చిన్మయ్‌కి బెయిల్‌ నిరాకరించటంతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి.

చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని ఆ దేశాన్ని కోరుతూ ప్రకటన చేసింది. మైనారిటీ సమూహాలతో సహా జీవ‌నం, స్వేచ్ఛ రక్షణ ప్రాథమికంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలనీ, దాని పౌరులందరూ శాంతియుత సహజీవనం కొన‌సాగించేలా చూడాల‌ని కోరింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం భారత్ లో మైనార్టీలపై దాడులు జరుతున్నాయని, వాటి పట్ల పశ్చాత్తం చూపకుండా మాకు నీతులు చెబుతూ మైనార్టీల రక్షణలో భారత్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తుందంటూ విమర్శలు చేసింది. అంతేగాకుండా చిన్మయ్ బ్యాంకు అకౌంట్లతో పాటు ఇస్కాన్ తో సంబంధమున్న 17బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసి కవ్వింపు చర్యలకు దిగడం వివాదస్పదమవుతోంది.

Advertisement

Next Story