శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్య ప్రవర్తన

by Aamani |
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్య ప్రవర్తన
X

దిశ, శేరిలింగంపల్లి : శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థులపై వేధింపులు, విద్యార్థుల మరణాలు శర మామూలుగా మారాయి. మొన్నటికి మొన్న మియాపూర్ కల్వరి టెంపుల్ మెయిన్ క్యాంపస్ లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా తాజాగా మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థిని, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ యూనియన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మదీనాగూడా శ్రీ చైతన్య కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న హరీష్ విద్యార్థినిల పట్ల గత కొంతకాలంగా క్లాస్ రూమ్ లో, ఒంటరిగా గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి మెసేజ్ లు చేస్తున్నాడు.

మీకు నాపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అంటూ మెసేజ్ లు చేయడమే కాకుండా ఒంటరిగా కనిపించిన అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినిలు తెలిపారు. అంతేకాకుండా నేను చాట్ చేసిన విషయాలు, ఇంకేమైన బయటకు వస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడని, ఆ విషయం బయటకు చెప్పకుండా కాలేజీ డీన్ నాగరాజు, ప్రిన్సిపాల్ ప్రభులు విద్యార్థులతో మాట్లాడి ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా బెదిరించారని, లేదంటే మీకు జీవితమే లేకుండా చేస్తామని బెదిరించారని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తల్లితండ్రులు కంప్లైంట్ చేసిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. లెక్చరర్ ను కాపాడేందుకు కాలేజీ యాజమాన్యం యత్నిస్తోందని, మాకేం సంబంధం లేదని కాలేజీ యాజమాన్యం ఎలా చెబుతారని మండిపడ్డారు.

కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ ను విద్యార్థుల ముందుకు తీసుకువచ్చే వరకు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఫిర్యాదు చేసినా లెక్చరర్ పై యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే కాలేజీ యాజమాన్యం అతనికి వకాల్తా పలుకుతున్నట్లేనని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు లెక్చరర్ పై కేసు పెట్టేందుకు సిద్దమయ్యారు. కాలేజీ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్సై కోన వెంకట్ కాలేజీ వద్దకు చేరుకుని బాధిత విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ కోసం పర్సనల్ నెంబర్ ఇవ్వాలని, లేదంటే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించారని విద్యార్థినులు ఎస్సై దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement

Next Story