కొనసాగుతున్న ప్రతిష్టంభన.. సీపీఎంతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు!

by GSrikanth |
కొనసాగుతున్న ప్రతిష్టంభన.. సీపీఎంతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఎటూ తేలకపోవడంతో కామ్రేడ్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ విడుదల చేసిన సెకండ్ లిస్ట్‌లో వామపక్షాలు కోరుతున్న కొత్తగూడెం, చెన్నూర్, మిర్యాలగూడ, వైరా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పొత్తుల అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు మరికొందరికి అప్పగించింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో మరోసారి చర్చలు జరపాలని ఇరు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉంది. అయితే చెన్నూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు రాష్ర్ట నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కాగా చెన్నూర్, కొత్తగూడెం స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపిందని, అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాముఖంగా వెల్లడించారు.

సీపీఎంతో కొత్త చిక్కులు

సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే మిర్యాలగూడ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీపీఎం కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు తీసుకొచ్చింది. పాలేరు, భద్రాచలం సెగ్మెంట్లను సైతం తమకు వదిలిపెట్టాలని ప్రతిపాదించింది. కమ్యూనిస్టులతో పొత్తు తేలకపోవడం, ఒక్కో నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తున్నవారు అధిక సంఖ్యలో ఉండడంతో అభ్యర్థులను ఫైనల్ చేయడం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది. అన్ని రకాల సమీకరణలు పూర్తిచేసి అభ్యర్థులను సెలక్ట్ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఆలస్యమైంది. రెండో లిస్ట్‌లోనూ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు అంగీకరించిన స్థానాలను వెల్లడించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయాలని పట్టుబడుతున్న పాలేరు సీటును కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన రెండో జాబితాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. తమకు రెండు స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిందని, సీట్ల కేటాయింపుపై ఏఐసీసీ నేతలతో సంప్రదించాకే క్లారిటీ ఇచ్చామని సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి చెప్పారు. ఏ సీట్లను ఫైనల్ చేయాలనే అంశం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు.

రెండు మూడ్రోజుల్లో కొలిక్కి

కాంగ్రెస్ మొదటి జాబితాలో 55, రెండో జాబితాలో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తం 100 స్థానాలకు ఎంపిక పూర్తయింది. మిగిలిన 19 సీట్లలో కొత్తగూడెం, చెన్నూరు సీట్లను సీపీఐకి, మిర్యాలగూడ, వైరా స్థానాలను సీపీఎంకు కాంగ్రెస్ కేటాయించే యోచనలో ఉందని సమాచారం. అయితే సీట్ల విషయంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య జాతీయస్థాయిలో జరుగుతున్న చర్చలు రెండు మూడు రోజుల్లో కొలిక్కివచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story