వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటే: హరీష్ రావు

by GSrikanth |
వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటే: హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీకి దమ్ముంటే కర్నాటక మోడల్‌తో తెలంగాణలో ఓట్లు అడగాలని మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. కర్నాటక గ్యారంటీలు చెల్లని గ్యారెంటీలు.. తెలంగాణలో చెల్లవు అన్నారు. కర్నాటక ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? ప్రజలు ఆలోచన చేయాలన్నారు. హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ రాంరాం చెప్పారు. ప్రచారంలో మభ్యపెట్టిన ప్రియాంక గాంధీ పత్తా లేదు.. ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణలోనూ కర్నాటక పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు గెలిచేవరకు ఒక్క ఛాన్స్‌ అంటారని, ఆ తర్వాత ఎక్స్‌క్యూజ్‌మీ అంటారని విమర్శించారు. వన్ ఛాన్స్‌ కాంగ్రెస్‌ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కర్ణాటకలో ఆరు నెలల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ రాలేదన్నారు. రాహుల్‌ గాంధీ.. రాంగ్ గాంధీగా మారిపోయారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్యూర్‌ మోడల్‌ను మెడలో వేసుకుని తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలనలో కర్నాటక అన్ని రంగాల్లో విఫలమైంది. ఆరు నెలల క్రితం చేసిన తప్పునకు కర్నాటక ప్రజలు బాధపడుతున్నారు. కర్నాటకలో ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. అరచేతిలో వైకుంఠం చూపించి.. ఇప్పుడు ప్రజలకు కాంగ్రెస్ నరకం చూపిస్తోంది. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. గుండెపోటు గ్యారెంటీ అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

ఐదు గ్యారంటీలతో కర్నాటకలో మోసం చాలదన్నట్లు.. ఆరు గ్యారంటీలతో రాహుల్ మోసం చేసేందుకు తెలంగాణకు వస్తున్నారని, ఝుఠామాటలను తెలంగాణలో చేసే ప్రయత్నం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాడు బీజేపీ హయాంలో పెద్ద నోట్ల రద్దు.. నేడు కాంగ్రెస్ కర్నాటకలో స్కీంల రద్దు.. కొత్త స్కీంల జాడ లేదు.. కానీ పాత స్కీంలకు పాతర వేస్తున్నారు. ఓటు వేసే ప్రజలకు ఏ ఒక్క పథకం అందడం లేదని, నమ్మిన రైతులకు కరెంటు లేదు.. ప్రజలకు రేషన్ బియ్యం లేవు.. విద్యార్థులకు స్కాలర్ షిపులు లేవు.. మహిళలకు ఉచిత ప్రయాణం అంతంత మాత్రమే.. అభివృద్ధి పనులకు అణాపైసా లేదు.. నిధులు అడిగిన ఎమ్మెల్యేలకు దిక్కులేదు.. అడిగిన అన్ని పనులకు ఒక్కటే సమాధానం ఖజానా ఖాళీ.. 6 నెలల క్రితం అరచేతిలో వైకుంఠం చూపారు.. ఆ మాటలు నమ్మి అధికారం అప్పగిస్తే.. కర్నాటక ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు.

వెలుగుల దీపావళి కావాలా? దివాళా తీసిన కర్ణాటక కావాలా? అనే ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని, కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలంగాణ రైతులు గమనించాలన్నారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై ఇప్పటికే యుద్ధం చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే అంటున్నారని విమర్శించారు. కర్ణాటలో తీవ్రమైన కరంటు కోతలు విధిస్తున్నారని దీంతో ఆరు నెలల్లోనే 357 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కర్ణాటక పరిస్థితి మనకెందుకన్నారు.

రాహుల్ గాంధీది గ్యారంటీలను ఎన్నికల గారడీలుగా మార్చారని, గాంధీ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ది ఫెయిల్యూర్ స్టోరీ అన్నారు. కర్నాటక ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం మేల్కోనాలని కోరారు. కర్నాటకలో మళ్లీ ఎన్నికలు పెడితే సగం స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలువదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నదిచేసేలా చిదంబరం మాట్లాడారని విమర్శించారు. కడుపులో చిచ్చుపెట్టి కండ్లు చూడవస్తారా అన్నట్లు ఆయన వ్యవహారం ఉందన్నారు. కాంగ్రెస్ గాయాన్ని గుర్తుచేసుకొని.. ఆపార్టీని అమరవీరుల కుటుంబాలు శపిస్తున్నాయన్నారు. చంపేది మీరే.. సారి చెప్పేది మీరేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. చిదంబరం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా కాంగ్రెస్‌ పార్టీ పాపం పోదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకురాలు కత్తి కార్తికతోపాటు పలువురు నేతలు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.




Advertisement

Next Story

Most Viewed