షెడ్యూల్ వచ్చినా ప్రధాన పార్టీలు సైలెన్స్.. కారణం ఇదే!

by GSrikanth |
షెడ్యూల్ వచ్చినా ప్రధాన పార్టీలు సైలెన్స్.. కారణం ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వెల్లడైంది. ఎన్నికల నగారా మోగి రెండు రోజులు గడుస్తున్నా ప్రధాన పార్టీలు సైలెంట్‌గా వ్యవహరిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల విషయంలో పూర్తి స్థాయిలో పొలిటికల్ గ్రౌండ్‌లోకి దిగలేకపోతున్నాయి. అయితే పార్టీల స్తబ్దు వెనుక అమావాస్య గండం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్ 14న అమవాస్య కావడంతో అప్పటి వరకు పార్టీలు నామమాత్రంగా వ్యవహరించి ఆ తర్వాత పూర్తి స్థాలో రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాతే జోరు:

డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించినా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం నవంబర్ 30న పోలింగ్ తేదీ ఖరారు చేసింది. ఎన్నికల తేదీ తెలిసినా పార్టీలు మాత్రం ప్రచారం పర్వానికి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడం లేదు. ఇంకా అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోల కసరత్తుపైనే ఫోకస్ పెట్టాయి. ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు మంచి మూహుర్తాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సైతం మంచి మూహుర్తం చూసుకున్నాకే కాలు బయటకు పెట్టేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అమావాస్య మరుసటి రోజు నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారు చేసుకున్నారు. అక్టోబర్ 15 నుంచి ఆయన జిల్లా పర్యటనలకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం అమమాస్య తర్వాతే అక్టోబర్ 15 నుంచి లేదా ఆ తర్వాతే బస్సు యాత్ర ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం పూర్తి స్థాయిలో అక్టోబర్ 15 తర్వాతే రంగంలోకి దిగబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిన్న అమిత్ షా రాష్ట్రానికి వచ్చినా అది షెడ్యూల్ వెలువడక ముందే ఖరారైన ప్రోగ్రామ్. అందువల్ల తెలంగాణలో రాజకీయ పార్టీలన్ని ప్రచారాన్ని మెయిన్ ట్రాక్ ఎక్కించాలంటే అమవాస్య పూర్తయ్యే వరకు ఆగాల్సిందే అనే చర్చ జరుగుతోంది.

నామినేషన్లకు ఇప్పటి నుంచే మూహుర్తాల వేట:

ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అభ్యర్థులు, ఆశావహులు అప్పుడే నామినేషన్లపై ఫోకస్ పెట్టారు. తమ జాతక రీత్యా నామినేషన్ దాఖలు చేసేందుకు మంచి రోజు కోసం ఇప్పటినుంచే తమకు కలిసి వచ్చే పండితుల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికల్లో విజయం వరించేందుకు తమ జాతక రీత్యా అనుకుల, ప్రతికూల అంశాలపై బేరీజు వేసుకుంటూ పరిహారాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలువురు నేతలు యాగాలు నిర్వహించగా మరి కొంత మంది నేతల కుటుంబాలు అదే బాటలో వెళ్తున్నాయనే ప్రచారం ఆసక్తిగా మారింది. మరి ఎవరి జాతకం ఎలా ఉండబోతున్నది అనేది డిసెంబర్ 3న తేలనుంది.

Advertisement

Next Story

Most Viewed