బీఆర్ఎస్ నన్ను వెళ్లగొట్టింది.. నేను మారలేదు: ఈటల రాజేందర్

by GSrikanth |
బీఆర్ఎస్ నన్ను వెళ్లగొట్టింది.. నేను మారలేదు: ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొత్తం జనాభా 3 కోట్ల మంది అనుకున్నా.. అందులో కోటిన్నర మంది మహిళలు ఉంటారని, అంతమంది మహిళలకు రూ.2500 ఎలా ఇవ్వగలుగుతారో, ఎలా సాధ్యపడుతుందో స్పష్టత ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారని, ఇది కూడా ఎలా సాధ్యమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో మొదటిసారి మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని ఆయన తెలిపారు. చట్ట సభల్లోనూ మహిళలకు అవకాశం దక్కినట్లయిందన్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్.. దళితులకో స్కీమ్, బీసీ, గిరిజన బంధు అంటూ కబుర్లు చెప్పారని, వీటితో పాటు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అమలులో మాత్రం ఫెయిలయ్యారని విమర్శించారు.

మనసుంటే మార్గం ఉంటుంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న ముఖ్యమంత్రి ఎందుకు హామీలు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని ఈటల ప్రశ్నించారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదన్నారు. పేదలపై కేసీఆర్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఓట్ల సమయంలో చెప్పే మాటలు, చేతల్లోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ డబ్బులు ఇచ్చేందుకు ఇంకా సమయం ఉన్నా.. ముందే మద్యం టెండర్లను పిలిచారని మండిపడ్డారు. కేసీఆర్ హామీలు నెరవేరుస్తానంటే ఆహ్వానించే పార్టీ బీజేపీ అని ఆయన చెప్పారు. అతి త్వరలోనే మంచి మేనిఫెస్టో కోసం కమిటీ వేయబోతున్నట్లు ఈటల చెప్పారు. రైతులకు, కౌలు రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే పార్టీలను నమ్మొద్దని, అమలు చేసే బీజేపీని నమ్మాలని ఆయన కోరారు.

కొన్ని పత్రికలు, ఛానళ్లు స్వీయ భావాలను తమ పత్రికల్లో రాస్తున్నాయని ఈటల ధ్వజమెత్తారు. పత్రికల్లో పిచ్చి రాతలు రాయొద్దని హెచ్చరించారు. తనకు శత్రువులెవరూ లేరని, ప్రజల కాలుకు ముల్లు గుచ్చుకుంటే పన్నుతో తీసే వ్యక్తిని తానంటూ చెప్పుకొచ్చారు. 22 ఏండ్లుగా తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తినంటూ వెల్లడించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో తన ఫోటో ఉందన్నారు. పార్టీ మారిన చరిత్ర ఈటలకు లేదని, బీఆర్ఎస్ వాళ్లు వెళ్లగొట్టారు తప్పితే.. తాను పార్టీ మారలేదని నొక్కిచెప్పారు. పార్టీ మారడం.. బట్టలు మార్చినంత ఈజీ కాదని ఈటల తెలిపారు. తనను వెళ్లగొట్టిన పార్టీ కూడా ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఘర్ వాపస్ అంటూ కామెంట్లు చేశారని, అలాంటి వ్యక్తిత్వం తనదని చెప్పుకొచ్చారు. త్వరలోనే బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని, ఇందుకు అంతా సిద్ధం చేసినట్లు ఈటల చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed