టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని వైఎస్సార్ టీపీ విద్యార్థి విభాగం డిమాండ్

by Mahesh |   ( Updated:2023-09-28 14:18:05.0  )
టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని వైఎస్సార్ టీపీ విద్యార్థి విభాగం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ పీఎస్సీ బోర్డుని తక్షణమే రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆపై కొత్త బోర్డు ద్వారా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే డిమాండ్ తో కొత్త రాష్ట్రం ఏర్పడితే.. నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల నోట్లో కేసీఆర్ సర్కార్ మట్టి కొట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వేలాది మంది నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర ఇంకా కళ్లముందే కదలాడుతందన్నారు. ఆత్మ బలిదానాలపై ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసిందని నాగరాజు ఆవేదన చెందారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు భర్తీ చేసింది లేదన్నారు.

ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా ఏదో ఒక మెలిక పెట్టి మళ్ళీ ఏదో విధంగా కోర్టుకు వెళ్ళేలా చేస్తున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రూప్ 1 లాంటి పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా మార్కెట్లో చేపల్లాగా అమ్మకానికి పెట్టారని, విషయం బయటపడడంతో మళ్ళీ హడావుడిగా పరీక్షలు నిర్వహించి తప్పులను పునరావృతం చేసిందని, బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్ టికెట్ నెంబర్ లేకుండా, ఉండాల్సిన దానికంటే 258 ఓఎంఆర్ షీట్స్ అదనంగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇలా తప్పులతడకగా రెండోసారి ఎగ్జామ్ నిర్వహించడంతో హైకోర్టు రద్దు చేసిందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నాగరాజు పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story