‘నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది’

by GSrikanth |   ( Updated:2023-06-08 12:15:16.0  )
‘నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది’
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్‌లపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.‘వాషింగ్ పౌడర్ నిర్మా’ కేసీఆర్‌కు సైతం పనిచేసినట్టుందని విమర్శలు గుప్పించారు. నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగిందని.. బీజేపీతో దోస్తీ బయటపడిందని అన్నారు. కారు-కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ మొఖంలో కనపడుతుందని ఎద్దేవా చేశారు. నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర.. మోడీని పల్లెత్తుమాట కూడా అనడం లేదని అన్నారు. బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడని షర్మిల ఆరోపించారు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగొద్దని బీజేపీకి సలాం కొట్టాడని మండిపడ్డారు.

అవసరానికి తగ్గట్లు వేషాలు మారుస్తూ, జనాలను పిచ్చోళ్ళను చేయడమే బీజేపీ, బీఆర్ఎస్ రహస్య అజెండా అని ఆమె ఆరోపించారు. నువ్వు కొట్టినట్లు చెయ్యి-నేను ఏడ్చినట్లు చేస్తా అంటూ ఇన్నాళ్లు బీజేపీతో కేసీఆర్ నడిపిన దోస్తానా ఇదేనని షర్మిల సెటైర్లు వేశారు. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా..ప్రీ పోల్ ఒప్పందమా? పోస్ట్ పోల్ ఒప్పందమా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కమలం ముసుగు కప్పుకొని కారులో తిరిగే కేసీఆర్.. అసలు విషయం బయటపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమా? బీజేపీ అభ్యర్థులు కేసీఆర్‌కు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రీమెంటా? కేసీఅర్‌కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందమా? ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత? అంటూ బీజేపీని వరుస ప్రశ్నలతో షర్మిల నిలదీశారు. వీటిపై తక్షణమే బీజేపీ నోరు విప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read: YS షర్మిలకు షాక్.. ఆ కేసులో సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు!

Advertisement

Next Story