ఇది గుంటూరా? గుంటలూరా?.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ఇది గుంటూరా? గుంటలూరా?.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్ పాలనలో యువతకు ఉద్యోగాలు రావడం లేదని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాటిచ్చి.. విస్మరించారని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల వేళ హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది గుంటూరా?, గుంటలూరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా బాగోలేదని.. గుంటూరులో మరీ అధ్వాన్నంగా మారాయని వ్యాఖ్యానించారు. రోడ్లు వేసేందుకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తాయారైందని వెల్లడించారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని గుర్తుచేశారు. ఈ పదేళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలో వ్యవసాయాన్ని దండగ అనేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు సబ్సిడీలు, పంటనష్టం పరిహారాలు ఏమీ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు, జగన్ పాలనకు చాలా తేడా ఉందని చెప్పారు. అందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న ధ్యేయంతో వైఎస్ఆర్ పనిచేశారని తెలిపారు. జగన్ సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని తెలిపారు. పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయని గుర్తుచేశారు. ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దే అన్నారు. నేడు ముస్లింలు, క్రిస్టియన్లకు భరోసా లేదని తెలిపారు.

Advertisement

Next Story