రైతుబంధుపై కీలక నిర్ణయం.. మెజారిటీ రైతులు అదే కోరుకుంటున్నారా?

by GSrikanth |   ( Updated:2023-12-28 03:29:39.0  )
రైతుబంధుపై కీలక నిర్ణయం.. మెజారిటీ రైతులు అదే కోరుకుంటున్నారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు స్కీమ్‌కు ప్రభుత్వం సీలింగ్ విధించనున్నదా?.. మెజారిటీ రైతులు అదే కోరుకుంటున్నారా?.. అర్హులైన పేదలకు మాత్రమే వర్తింపజేసేలా ఆలోచిస్తున్నాదా?.. భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర అప్పర్ మిడిల్ క్లాస్‌ను మినహాయించాలనుకుంటున్నదా?.. ప్రజాధనం వృథాను అరికట్టాలనే నిర్ణయానికి వచ్చిందా?.. రైతుభరోసా పథకంలో దానికి అనుగుణంగా మార్పులు జరగనున్నాయా?.. వీటన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం మౌఖికంగా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. దీంతో ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సెషన్‌లో విపక్షాల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా విధాన నిర్ణయం తీసుకోనున్నది.

గత ప్రభుత్వం రైతుబంధు స్కీమ్‌ను సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టింది. సాగుభూమి ఉన్నవారందరికీ వర్తింపజేసింది. భూస్వాములు, వ్యాపారులు, ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు, లగ్జరీ కార్లు వాడే సంపన్నులకు కూడా ఈ స్కీమ్ ఫలాలు అందుతున్నాయని చాలా కాలంగా రైతుల నుంచి విమర్శలు ఉన్నాయి. సీపీఐ, బీజేపీ నేతలు సైతం సంపన్నులకు రైతుబంధు ఇవ్వడాన్ని తప్పుపట్టాయి. సాగులో లేని భూములకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడంపైనా అసంతృప్తిని వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ నేతలకూ ఈ విషయం తెలిసినా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ పవర్‌లోకి వచ్చిన తర్వాత సీలింగ్ విధించడంపై ఆలోచిస్తామని స్వయంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రజాధనాన్ని అర్థంవంతంగా వాడేలా :

దుబారాను, అడ్డగోలు ఖర్చులను నివారించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిస్సహాయులకు సాయం అందించాలని, ప్రజా ధనం దుర్వినియోగం కావద్దని నొక్కిచెప్పడంతో అర్థవంతంగా వాడడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజా పాలనను లాంఛనంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్.. అప్లికేషన్ల నమూనాను సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు లేవనెత్తిన అంశంపై సీఎం బదులిస్తూ.. రైతుబంధు స్కీమ్‌కు సీలింగ్‌పై చాలా మంది నుంచి రిక్వెస్టులు, ప్రతిపాదనలు వస్తున్నాయని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి రాగులుతుందన్నారు.

గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు సాయాన్ని అందించాలనేది కూడా వేర్వేరు సెక్షన్ల ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటామని, అసెంబ్లీ వేదికగానే నిర్ణయం జరుగుతుందన్నారు. మరోవైపు ప్రజాధనాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టాలని భావిస్తున్నందున అధికాదాయ వర్గాలను దీని లబ్ధి నుంచి మినహాయించే అవకాశం లేకపోలేదు. దీంతో అసెంబ్లీలో చర్చ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జూన్-జూలై నెలల్లో విడుదల చేయబోయే పంట పెట్టుబడి సాయాన్ని రైతుభరోసా పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో జమచేయనున్నది. ఇప్పుడు రైతుబంధుకు అనుసరిస్తున్న మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేసి రైతుభరోసాకు స్పష్టమైన నిబంధనలను, గైడ్‌లైన్స్ ను రూపొందించనున్నది.

రెండు నెలల్లో క్లారిటీ :

ఒకవైపు సాగుభూమి విస్తీర్ణానికి అప్పర్ లిమిట్ (సీలింగ్) విధించడంతో పాటు కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా రైతుభరోసా పేరుతో సాయం అందించాల్సి ఉన్నందున పంట పెట్టుబడి సాయం నిజమైన అర్హులకు అందించేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రెండు మూడు నెలల్లోనే రైతుభరోసాపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. ఎక్కువ మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే ఉన్నప్పటికీ పాతిక ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి గణనీయంగా చెల్లిస్తున్నట్లు తేలింది. ప్రభుత్వం ప్రతీ సీజన్‌కు ఇప్పటివరకు సగటున ఏడున్నర వేల కోట్ల చొప్పున ఈ స్కీమ్‌కు ఖర్చు చేస్తున్నది. సంపన్నులను ఫిల్టర్ చేయడం ద్వారా పేదలకు పంట పెట్టుబడి సాయం ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Read More : నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. దరఖాస్తు ఎలా నింపాలో పూర్తి వీడియో


Advertisement

Next Story